ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానుల ప్రకటనతో స్థిరాస్తి రంగానికి ఎదురుదెబ్బ

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొంత మందగించింది. ఎన్నికల తర్వాత ఇసుక కొరత ప్రభావం నిర్మాణాలపై పడింది. ఇసుక దొరికి.. పనులు ప్రారంభించే సమయానికి రాజధాని మార్పు ప్రకటన స్థిరాస్తి రంగాన్ని కుప్పకూల్చింది. అడ్వాన్సులు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టిన బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి ప్రాజెక్టులు మొదలుపెట్టినవారు.. వాటిని తీర్చేదారి లేక కుదేలవుతున్నారు. ఈ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్రంగా ఉంది.

backlash to the real estate sector with the announcement of three capitals in AP
backlash to the real estate sector with the announcement of three capitals in AP

By

Published : Feb 14, 2020, 7:46 AM IST

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ఇలా ప్రకటించారో లేదో.. అమరావతి చుట్టుపక్కల కలల సౌధాలు కుప్పకూలాయి. రాజధాని పరిసరాల్లో ఓ ఇల్లుంటే మంచిదని భావించిన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవులు ఉసూరుమన్నారు. చిన్న, మధ్యతరహా, భారీ గృహనిర్మాణ ప్రాజెక్టుల ఆశలు అడియాసలయ్యాయి. రాజధానే ఇక్కడ లేనప్పుడు కొనడం ఎందుకని ఆగిపోయారు. ధరలు తగ్గించినా కొనేవాళ్లు లేరు. అడ్వాన్సులు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టిన బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి ప్రాజెక్టులు మొదలుపెట్టినవారు.. వాటిని తీర్చేదారి లేక కుదేలవుతున్నారు.

ఆ జిల్లాపైనే ఎక్కువ ప్రభావం....

రాజధాని మార్పు ప్రకటన ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్రంగా ఉంది. మచిలీపట్నం, నరసరావుపేట మినహా విజయవాడ, విజయవాడ ఈస్ట్‌, గుంటూరు, తెనాలి, అమరావతి ప్రాంతాల పరిధిలో ఆదాయం బాగా పడిపోయింది. ఈ రెండు జిల్లాల్లో 20వేల వరకు ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. విశాఖ వెళ్లాల్సి వస్తుందనే సంకేతాలతో ఉద్యోగులు వెనక్కి తగ్గారు.

రాజధాని ప్రకటనతో..

అమరావతిని రాజధానిగా ప్రకటించగానే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. స్థానికులతో పాటు ప్రవాసాంధ్రులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రెండు జిల్లాల్లోని ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల ధరలు పెరిగాయి. గుంటూరు చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారాయి. అప్పటివరకు ఎకరా రూ.50 లక్షలు పలికిన భూమి ధర రూ.కోటి నుంచి కోటిన్నరకు పెరిగింది. పెద్దఎత్తున అపార్టుమెంట్లు, గ్రూపు హౌస్‌లు, విల్లాల నిర్మాణాలు మొదలయ్యాయి. అంతర వలయ రహదారికి ఇరువైపులా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం మొదలైంది. 10-12 అంతస్తుల ఎత్తులో వందలాది అపార్టుమెంట్లు కట్టారు.

పెరిగిన భూమి విలువ

రాజధాని ప్రకటనలో విజయవాడ చుట్టుపక్కల భూముల విలువ భారీగా పెరిగింది. విజయవాడల నడిబొడ్డున రూ.800 కోట్లతో విలాసవంతమైన నివాస, వాణిజ్య భవన సముదాయాన్ని నిర్మించారు. ఇందులో ఒక్కో ఫ్లాట్‌ను రూ.2.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు అమ్మారు.

  • విజయవాడ వంద అడుగుల రోడ్డులో ఓ నిర్మాణసంస్థ 100 విల్లాల నిర్మాణం చేపట్టింది. ఒక్కోదాని ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. తూర్పు నియోజకవర్గంలో మరో సంస్థ చదరపు అడుగుకు రూ.7,000 వంతున నిర్ణయించింది. కానూరులో ఫుల్లీ ఫర్నిష్డ్‌ ఫ్లాటు రూ.45 లక్షలు పలికింది.
  • గుంటూరు నగరంలో డబుల్‌ బెడ్‌రూము రూ.45-50 లక్షలు, త్రిబుల్‌ బెడ్‌రూము రూ.70-75 లక్షల మధ్య విక్రయించారు.

కుప్పకూలిన స్థిరాస్తి రంగం

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొంత మందగించింది. ఎన్నికల తర్వాత ఇసుక కొరత ప్రభావం నిర్మాణాలపై పడింది. ఇసుక దొరికి.. పనులు ప్రారంభించే సమయానికి రాజధాని మార్పు ప్రకటన స్థిరాస్తి రంగాన్ని కుప్పకూల్చింది. గుంటూరులో ఒక్కో బెడ్‌రూముపై రూ.5 లక్షల వరకు తగ్గిస్తున్నా అమ్మకాలు లేవు. విజయవాడలో ఫ్లాట్ల ధరలు 20% వరకు తగ్గించినా కొనేవాళ్లు లేరు. ఇక్కడ ఏడాది క్రితం చదరపు గజం భూమి రూ.1.50 లక్షల వరకు పలికింది. ఇప్పుడు రూ.లక్ష చెబుతున్నారు.

పెరుగుతున్న వడ్డీలు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బ్యాంకులు లేదా బయటి నుంచి అప్పులు తెచ్చి భూములు కొని నిర్మాణాలు ప్రారంభించారు. వీళ్లంతా అప్పుల్లో కూరుకుపోయారు. గడువులోగా నిర్మాణాలు పూర్తిచేసి అమ్మితే ఎంతో కొంత మిగిలేది. ఇప్పుడు ధర తగ్గించినా అమ్మే పరిస్థితే లేదని ఒక వ్యాపారి వాపోయారు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కొన్నిచోట్ల ఫ్లాట్ల నిర్మాణం పూర్తయి.. రంగులు వేసినా, అడ్వాన్సులు ఇచ్చినవాళ్లు కొనుగోలుకు ముందుకు రావట్లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఎక్కడ ఎగవేతదారులుగా ప్రకటిస్తాయో అనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.

తనఖాల దిశగా

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గత కొద్దిరోజుల నుంచి సేల్‌డీడ్‌ రిజిస్ట్రేషన్లు తగ్గి.. తనఖా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సబ్‌ రిజిస్ట్రార్లు తెలిపారు. స్థలాల యజమానులు, బిల్డర్ల మధ్య జరిగే ఒప్పందాలూ తగ్గాయన్నారు. గతంలో ఫ్లాట్ల కోసం రూ.5-6 లక్షల అడ్వాన్సులు ఇచ్చి నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటామని చెప్పిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.

"పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల కొన్నాళ్లు కొనుగోళ్లు మందగించాయి. ఫ్లాట్ల విక్రయాలు పెరిగే సమయంలో తాజా పరిస్థితి స్థిరాస్తి రంగాన్ని అయోమయంలో పడేసింది. ప్రస్తుతం ధరలు తగ్గినా కొనేవాళ్లు ముందుకు రావడంలేదు. అమ్మేవారు వేచిచూసే ధోరణిలో ఉన్నారు." -వీఎన్‌ స్వామి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ విజయవాడ

ఇదీ చదవండి :ఆ రెండు బిల్లులకు ఆమోదమా..ఆర్డినెన్సా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details