ఆనందయ్య మందుపై తుది నివేదికలో ఏముంటుందన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఆయుష్ నిపుణుల విభాగం శనివారం ఆనందయ్య మందుపై తుది నివేదిక ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆయుష్ శనివారం ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చినప్పటికీ అధికారికంగా అందులోని అంశాలు బహిర్గతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయుష్ విభాగం ప్రాధమిక పరిశీలన అనంతరం ఇచ్చిన నివేదికలో ఈ మందు మూలికల మిశ్రమేనని ఆయుర్వేదం కాదని చాలా స్పష్టంగా ఇప్పటికే తెలిపారు. ఈ మందులో కలిపిన మూలికల గుణాలు మాత్రం హానికరం కాదని నిర్థారించారు. అవి ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నవేనని కూడా చెప్పారు.
ప్రభుత్వం కూడా ఆనందయ్య మందు విషయంలో సానుకూల వైఖరితోనే ఉంది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యుడు కాదు. ఆయనకు ఏ భారతీయ వైద్య విధానంలోనూ పట్టా లేదు. ఈ పరిస్థితిలో ఆనందయ్య మందుకు ప్రామాణిక సర్టిఫికెట్టు ఇవ్వడం ఆయుష్ విభాగానికి సాధ్యం కాదు. మందుల తయారీకి అనుసరించాల్సిన విధి విధానాలు చట్ట ప్రకారం లేకుంటే దాన్ని ప్రామాణికతకు అవకాశం లేదు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు కూడా ఆనందయ్య మందుపై ఆయుష్ తుది నివేదిక కోసం ఎదురు చూస్తోంది. ఈ మందును కేంద్ర – రాష్ట్రాలు ఎలా గుర్తిస్తాయన్న అంశంపై ఒక ఆసక్తి నెలకొంది. ఈ మందు కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ఎవరూ రావద్దని ఆనందయ్య కరోనా బాధిత కుటుంబీకులను కోరారు. ఈ మందు తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఇప్పటికే ముందుకు వచ్చింది. కరోనా బాధితులు చాలా మంది ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్నారు.