ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యాల్లో.. కొవిడ్, మ్యూకర్ మైకోసిస్ల చికిత్స, నివారణకు సంబంధించి నిపుణులు ప్రత్యేక ఔషధాలను పరిచయం చేశారు. బ్లాక్ ఫంగస్‌పై ఆయుష్ బాగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. కొవిడ్ బాధితులకు కూడా ఈ వైద్య విధానాలు కచ్చితంగా ఊరటనిస్తాయని స్పష్టం చేశారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా నివారణలోనే కాకుండా చికిత్సలోనూ తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. అలోపతి వైద్యాన్ని వినియోగిస్తూనే.. ఆయుష్ వైద్య విధానాలను కూడా అనుసరించవచ్చని తెలిపారు. ఎటువంటి దుష్ఫలితాలు ఎదురు కావని వివరించారు. అయితే ఏదిపడితే అది... ఎలాపడితే అలా కాకుండా తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్ల సూచనలు తీసుకునే తగిన వైద్య పద్ధతులను నిర్ణయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు వైద్యవిధానాలపై నిపుణులు చెబుతున్న సమాచారంతో ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.
ఆయుర్వేదంలో దివ్యౌషధాలు
కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా, మధ్యస్థంగా ఉన్న రోగులకు దివ్యంగా ఉపయోగపడే ఔషధం ఆయుష్-64. ఈ మాత్రను 15 రోజుల పాటు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వాడాలి. దీన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
* కబాసుర కుడినీర్: ఇది ఒక సిద్ధ ఔషధం. ఇందులో 13 రకాల మూలికలుంటాయి. ఇది పొడి రూపంలో ఉంటుంది. ఒక స్పూను పొడి వేసి, 100మి.లీ. నీళ్లు పోసి, 50 మి.లీ. అయ్యే వరకూ బాగా కాచి, కషాయం మాదిరిగా చేసుకొని ఉదయం ఒక సగం అంటే 25 మి.లీ.. రాత్రికి మరో సగం తాగాలి. ఇలా 15 రోజుల పాటు తాగాలి. దీన్ని కూడా కేంద్ర ఆయుష్ శాఖ సిఫార్సు చేసింది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారిలో బాగా పనిచేస్తుంది.
* శంషమని వటి:ఇందులో ‘గూడూచీ’ అనేది ప్రధాన ఔషధంగా ఉంటుంది. దీన్ని 500 మిల్లీ గ్రాములు ఉదయం, రాత్రి ఒక్కటొక్కటి చొప్పున 21 రోజుల పాటు వేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. కొవిడ్‌లో ఏ అవయవాలైతే ఎక్కువగా దుష్ప్రభావానికి లోనవుతాయో.. వాటిని ఈ ఔషధాలు బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు బలం చేకూర్చుతాయి.
* అశ్వగంధ:500 మి.గ్రా. ఈ మాత్రను ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 15-20 రోజుల పాటు వాడాలి.
బ్లాక్ ఫంగస్‌కు..
బ్లాక్ ఫంగస్‌ను తొలిదశలో గుర్తించకపోతే.. చాలా త్వరగా ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. అందుకే కొవిడ్ సోకి తగ్గిన వారు, మధుమేహులు కొన్ని ఆయుర్వేద ఔషధాలను 21 రోజుల పాటు వాడుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలోపతి మాత్రలు అప్పటికే ఏమైనా వాడుతుంటే.. వాటిని కూడా వీటితో పాటు వేసుకోవచ్చు. అయితే అలోపతి, ఆయుష్ మాత్రలకు మధ్య 45 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
* శంషమని వటి:500 మి.గ్రా. మాత్రను ఉదయం, రాత్రి ఒక్కొక్కటి భోజనం తర్వాత వేసుకోవాలి.
* నిషామలకి వటి:500 మి.గ్రా. మాత్రను ఉదయం, రాత్రి ఒక్కొక్కటి వాడుకోవాలి.
* సుదర్శన ఘన వటి:500 మి.గ్రా. మాత్రను ఉదయం, రాత్రి ఒకటి చొప్పున వాడాలి.
* ఆయుష్ 64: ఉదయం, రాత్రి ఒకటి చొప్పున 15 రోజులు పాటు వాడితే సరిపోతుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆహార నియమాలూ ముఖ్యమే
కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత.. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే అలోపతి మందులు కూడా వాడుతూ.. వీటిని అదనంగా వాడాలి. ఇతర ఆహార, వ్యాయామ నియమాలు పాటించడం ద్వారా రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
*గోరు వెచ్చని నీటిని తాగాలి.
*వేడిగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలు తీసుకోవాలి.
*తేలికగా జీర్ణమయ్యేవి తినాలి.
*దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూర తదితర పండ్లను తీసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయొద్దు.
*రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలి.
*చల్లనివి, శీతల పానీయాలు వద్దు.
*బేకరీ, నిల్వ ఆహారాలను తినొద్దు.
*చల్లని గాలిలో తిరగొద్దు. ఏసీ, కూలర్లకు కూడా దూరంగా ఉండాలి..