సర్కారుకు ఆదాయం సమకూర్చడమే ధ్యేయంగా అధికారులు కుస్తీ పడుతున్నారు. అలాంటి వారికి రూ.650 కోట్ల నీటితీరువా బకాయిల అంశం దొరికింది. ఇంకేం అంతా కలిసి రైతుల వెంటపడుతున్నారు. దాదాపు పదేళ్లుగా పెండింగులో ఉన్న పన్నును ఒకేసారి చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారు. పైగా 6% వడ్డీని జరిమానాగా విధిస్తున్నారు. రెండు మూడు నెలల నుంచి నీటి తీరువా వసూలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే రూ.100 కోట్ల వరకు వసూలు కావడం గమనార్హం. దిగుబడులు సరిగా లేక, గిట్టుబాటు అందక అల్లాడుతున్న కర్షకులపై ఈ పరిణామం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎకరాకు రూ.200, రబీలో రూ.150 చొప్పున నీటి తీరువా చెల్లించాలి. వర్షాభావంతోపాటు వివిధ కారణాలతో పదేళ్లుగా నీటి తీరువాను ఎవరూ పట్టించుకోలేదు. అదంతా రూ.650 కోట్లకు చేరింది. రాబడికి మార్గాలు వెతుకుతున్న ప్రభుత్వాన్ని ఈ మొత్తం ఊరిస్తోంది. ఎలాంటి వెసులుబాట్లు లేకుండా ప్రతి రైతు ఎకరాకు ఏడాదికి రూ.350 చొప్పున పదేళ్లకు రూ.3,500 చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. పదెకరాలున్న రైతులు రూ.35 వేలు అప్పజెప్పాలి. దీనికి 6% వడ్డీ అదనం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్‌లో రూ.13 కోట్ల నీటితీరువా రావాల్సి ఉంది. ప్రస్తుత ఏడాదివి రూ.1.41 కోట్లు, బకాయిలు రూ.11.90 కోట్లు ఉన్నాయి. వీటిలో వడ్డీ రూ.65 లక్షలు కావడం గమనార్హం.
అత్యధికంగా కృష్ణా జిల్లాలో..
రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో రూ.200 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.70 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.65 కోట్ల వరకు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రూ.10 కోట్ల చొప్పున, పశ్చిమలో రూ.25 కోట్ల వరకు వసూలవడం గమనార్హం. తూర్పుగోదావరిలో రూ.40 కోట్ల లక్ష్యానికి రూ.12 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వీఆర్వోలు రైతుల నుంచి పన్ను వసూలు చేశారు. ఇకపై అంతర్జాలం ద్వారా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు రైతులకు ప్రత్యేక కార్డులు అందచేయాలని భావిస్తున్నారు.