kandula ramesh అమరావతిని నాశనం చేసేందుకు వైకాపా చేయని ప్రయత్నం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక అడ్డుపుల్లలు, ఆరోపణలు, కోర్టు కేసులతో అమరావతిని అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన వైకాపా... అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేసిందని సీనియర్ పాత్రికేయుడు, రచయిత కందుల రమేష్ రచించిన ‘అమరావతి: వివాదాలు- వాస్తవాలు’ పుస్తకంలో పేర్కొన్నారు. అమరావతిపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతూ, అవాస్తవాలు ప్రచారం చేస్తూ, అనేక వివాదాలు సృష్టించిన వైకాపా.. ప్రభుత్వంలోకి వచ్చినా అదే ధోరణి కొనసాగించిందని, అమరావతి ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు పనికిరాదని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని... లేనిపోని వివాదాలు సృష్టించిందని, కోర్టులు మొట్టికాయలు వేసినా వైకాపా నాయకుల ధోరణి మారలేదని ఆయన పేర్కొన్నారు. రమేష్ రాసిన పుస్తకం గురువారం విడుదలవుతోంది. అమరావతి పరిణామ క్రమాన్ని దగ్గర్నుంచి పరిశీలించిన ఆయన.. అమరావతిపై ముసురుకున్న వివాదాలేంటి, వాటికి కారకులెవరు, వాటిలో వాస్తవమెంత, వైకాపా పాత్రేంటి? స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల ముసుగులో ఆ వివాదాలకు మద్దతిచ్చినవారెవరు? చివరకు వారెలా భంగపడ్డారన్న విషయాల్ని కూలంకషంగా, సాధికారికంగా చర్చించారు. రమేష్ తన పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని ముఖ్యమైన వివాదాలు, అవి ఎలా నిర్హేతుకమో వివరించిన విధానం ఇలా ఉంది.
వివాదం: శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు విరుద్ధంగా రాజధాని ప్రాంతం ఎంపిక
వాస్తవం:శివరామకృష్ణన్ కమిటీ తయారుచేసిన సూటబులిటీ ఇండెక్స్ ప్రకారం మిగతా ప్రాంతాల కంటే విజయవాడ-గుంటూరు ప్రాంతమే అనువైనది. ఒక అస్పష్ట, అర్థరహిత నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, చివరకు రాజధాని ఎక్కడ ఉండాలన్నది అంతిమంగా రాష్ట్రప్రభుత్వ నిర్ణయమేనని చెప్పింది. కమిటీ సిఫారసులు సలహాపూర్వకమే గానీ, ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సినవి కావని శివరామకృష్ణనే చెప్పారు. కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని ఎంపికచేసిందనే ఆరోపణను ఎన్జీటీ తిరస్కరించింది. రాజధాని ప్రాంతం ఎంపిక పూర్తిగా రాష్ట్రప్రభుత్వ అధికారమని స్పష్టంచేసింది.
వివాదం: రైతుల్ని బెదిరించి, బలవంతంగా భూములు లాక్కున్నారు
వాస్తవం:29వేల మందికిపైగా రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. ప్రభుత్వాన్ని నమ్మి, ఇంతమంది రైతులు భూములు ఇవ్వడాన్ని పరిశీలకులు అబ్బురంగా పరిగణించారు. స్వామినాథన్ అయ్యర్ వంటి ఆర్థికవేత్తలు ప్రశంసించారు. ప్రపంచబ్యాంకు వంటి ఆర్థికసంస్థలు కూడా అమరావతి నమూనాను ఆసక్తిగా అధ్యయనం చేశాయి. అమరావతిలో భూసమీకరణ రైతులకు నష్టదాయకమని, బలవంతంగా ప్రభుత్వం భూములు లాక్కుందన్న ఆరోపణలను ఎన్జీటీ కూడా కొట్టేసింది.
వివాదం:అమరావతి నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం
వాస్తవం:అప్పటి ప్రభుత్వం నిబంధనలన్నీ పాటిస్తూ అమరావతి నిర్మాణం చేపట్టినా... పర్యావరణం పేరుతో దెబ్బకొట్టేందుకు చివరివరకూ ప్రయత్నాలు జరిగాయి. వ్యవస్థల్ని, కోర్టుల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది. అమరావతికి ప్రభుత్వం లక్ష ఎకరాలు సేకరించనుందని, భూసమీకరణ పేరుతో రైతుల భూముల్ని లాక్కుంటున్నారని, వేలమంది రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం వారిని బెదరగొడుతోందని, ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో భూసేకరణకు బదులు, ప్రభుత్వం భూసమీకరణ పద్ధతి చేపట్టిందని, దళిత రైతులకు, ఇతర రైతులకు మధ్య వివక్ష చూపిస్తున్నారని, లక్షల కోట్ల ప్రజాధనం ఈ ప్రాజెక్టులో కుమ్మరిస్తున్నారన్న ఆరోపణలతో శ్రీమన్నారాయణ అనే వ్యక్తి 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్జీటీకి వెళ్లకుండా ఇక్కడెందుకు పిటిషన్ వేశారని కోర్టు ప్రశ్నించడంతో ఆయన ఎన్జీటీకి వెళ్లారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, ప్రస్తుతం జనసేనలో ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ అమరావతికి వ్యతిరేకంగా అనుబంధ పిటిషన్లు వేశారు. వాటిని తోసిపుచ్చుతూ 2016 సెప్టెంబరులో ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
వివాదం:భూకంపాల జోన్లో ఉంది కాబట్టి ప్రమాదం
వాస్తవం:అమరావతి జోన్-3లో ఉంది కాబట్టి భూకంప ప్రమాదం తక్కువని, అత్యాధునిక భవన నిర్మాణ టెక్నాలజీలు వినియోగిస్తే భూకంప ప్రమాదం కనిష్ఠంగా ఉంటుందన్న ప్రభుత్వవాదనతో ఎన్జీటీ ఏకీభవించింది. అమరావతి ప్రాంతంలో 2021 ఫిబ్రవరి 27న భూకంపం సంభవించినట్టు సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. ఆ రోజున భూకంపం వచ్చినట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించలేదు.
వివాదం:రాజధాని నిర్మాణంతో చిత్తడినేలలు దెబ్బతిని, పర్యావరణానికి నష్టం
వాస్తవం:రాజధానిలో చెరువులు, కుంటల వంటి జలవనరులు 616 ఎకరాల్లో ఉంటే, మరో 1,215 ఎకరాల్లో వాటిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండవీటివాగు, పాలవాగుల్ని విస్తరించడం వల్ల కొత్తగా ప్రతిపాదించిన అయిదు కాలువల నిర్మాణం వల్ల మరో 1,410 ఎకరాల్లో గ్రీన్ బఫర్‌జోన్ ఏర్పడుతుంది.
వివాదం: తుపానుల ముప్పు ఎక్కువ
వాస్తవం:సముద్రతీరం నుంచి అమరావతి 60-80 కి.మీ.ల దూరంలో ఉన్నందున అక్కడ తుపాను తాకిడి ఉండే అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో ఎన్జీటీ ఏకీభవించింది.
వివాదం: సారవంతమైన భూముల్లో నిర్మాణాలు చేపడితే దేశ ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుంది
వాస్తవం:రాష్ట్రం మొత్తంలో సాగుచేస్తున్న భూమిలో రాజధాని ప్రాంత సాగుభూమి 0.027% మాత్రమే. రాష్ట్రంలో సాగవుతున్న వరిలో... రాజధానిలో సాగవుతున్న వరి విస్తీర్ణం 0.077% మాత్రమే. దీన్నిబట్టి అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల దేశ ఆహారభధ్రతకు ముప్పన్న వాదన తప్పని ఎన్జీటీ పేర్కొంది.
వివాదం:అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతి తీసుకోలేదు
వాస్తవం:రాజధాని నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతుల మీద అనేక రకాల వివాదాలు రేపడానికి ప్రయత్నాలు జరిగాయి. మొదట జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాన్ని కోర్టు అడ్మిట్ చేసుకోలేదు. తర్వాత పి.శ్రీమన్నారాయణ, ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీలో పిటిషన్లు వేశారు. 2015 నుంచి 2019 వరకు ఎన్జీటీలో, తర్వాత సుప్రీంకోర్టులో కేసులు కొనసాగాయి. వారి వాదన ఎక్కడా నిలబడలేదు. పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ 2006లో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వ అనుమతి అవసరం కాగా, బీ కేటగిరీ ప్రాజెక్టులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ ముందస్తు అనుమతి చాలు. అమరావతి నిర్మాణం బీ కేటగిరీలోకి వస్తుంది. రాష్ట్ర పర్యావరణ సంస్థ అనుమతిని ప్రభుత్వం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన పర్యావరణ ప్రభావ మదింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పూర్తిచేసిందని ఎన్జీటీ పేర్కొంది.
వివాదం:అమరావతి ప్రాంతం కాలుష్య కాసారం
వాస్తవం:అమరావతి ప్రాజెక్టు ప్రాంతం కాలుష్య కాసారమని ఆరోపిస్తూ నేషనల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టేటస్ అండ్ ట్రెండ్స్-2012 నివేదికను పిటిషనర్లు చూపారు. నిజానికి దానిలో అమరావతి ప్రాంత ప్రస్తావన లేదు. విజయవాడ బెంజిసర్కిల్ ప్రస్తావన ఉంది. ప్రతిపాదిత రాజధాని కృష్ణానదికి ఆవల ఉంది. అక్కడ కాలుష్యభయాలకు హేతువు లేదని ఎన్జీటీ స్పష్టంచేసింది.
వివాదం: గత ప్రభుత్వం అమరావతి పనుల్లో విపరీతమైన జాప్యం చేసింది
వాస్తవం:ఆ జాప్యానికి ప్రధాన కారణం ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకున్న సైంధవులే. ఎన్జీటీలో రెండేళ్లు, సుప్రీంకోర్టులో ఏడాదిపాటు కేసులు నడవడంతో పనులు వేగంగా చేపట్టేందుకు వీల్లేకపోయింది.