ఈర్ష్య వివేకాన్ని చంపేసింది. అసూయ మానవత్వాన్ని మింగేసింది. అమానుషత్వం ఓ ముక్కుపచ్చలారని పసిబాలుడి ఉసురు తీసింది. నిండా మూడేళ్లు నిండని బాలుడిని రెండో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి విసిరేసిందో మహిళ. బాలుడి కాళ్లూ చేతులు పట్టుకుని, పక్కింటి వారు చూస్తుండగానే, వద్దువద్దని వారు వారిస్తుండగానే నిర్దయగా కిందికి తోసేసింది. తనకు పిల్లలు లేకపోవడం, బావ కుమారుడిని అందరూ ముద్దు చేయడాన్ని సహించలేని, భరించలేని ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. గతంలోనూ ఆ పసివాడిని కరెంట్ షాక్‌తో చంపబోయింది. ఆ చిన్నారి సుకుమారపు చేతులను తలుపుల మధ్య ఇరికించడం వంటి వికృత చేష్టలకు పాల్పడింది.
భవానీనగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలివి. హైదరాబాద్ పాతబస్తీలోని ఈదీబజార్ కుమార్‌వాడికి చెందిన మహ్మద్ ఎతేషాముద్దీన్ (32), సుజావుద్దీన్ (27)లు సోదరులు. ఒకే భవనంలో ఉంటున్నారు. ఎతేషాముద్దీన్‌కు అస్మాసిద్దికా (26)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. గతంలో వీరికి కుమార్తె జన్మించిన ఐదు రోజులకే చనిపోయింది. మూడేళ్ల క్రితం వీరికి నుమానుద్దీన్ (3) జన్మించాడు. బాలుడు ఒక్కడే కావడంతో అందరూ ప్రేమతో చూసుకునేవారు. ఏడాదిన్నర క్రితం సుజావుద్దీన్‌కు ఆయేషాబాను (24)తో వివాహమైంది. వీరికి సంతానం లేదు.