సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణతోపాటు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లేఖ రాసి, దాన్ని బహిరంగంగా విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయకల్లంల చర్య... ధిక్కారం కిందకే వస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉందని చెప్పారు. అందులో జోక్యం చేసుకోవడం తనకు తగదని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులపై అనుచిత ఆరోపణలు చేస్తూ లేఖ రాయడంతోపాటు, దాన్ని బహిర్గతం చేయడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది కాబట్టి జగన్, అజేయ కల్లంలపై కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం.. క్రిమినల్ కంటెమ్ట్ ప్రొసీడింగ్స్ మొదలుపెట్టడానికి తనకు అనుమతివ్వాలని కోరుతూ భాజపా నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు. దీనికి జవాబుగా రాసిన లేఖలో వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వేణుగోపాల్ లేఖ సారాంశమిదీ..
'ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజేయ కల్లంలపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలకు ఉపక్రమించడానికి అనుమతి కోరుతూ మీరు రాసిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించా. అక్టోబర్ 6న ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి రాసిన లేఖలో ముఖ్యమంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గమనించా. విలేకర్ల సమావేశంలో ఆ లేఖను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం బహిర్గతం చేశారు. ఆ లేఖలో చేసిన ఆరోపణల తీరు గురించి ప్రధాన న్యాయమూర్తికి పూర్తిగా తెలుసు. ప్రజాప్రతినిధులపై కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని సెప్టెంబరు 16న జస్టిస్ రమణ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో.. జగన్ లేఖ రాసిన సమయం, దానిని విలేకరుల సమావేశం ద్వారా బహిర్గతం చేసిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నది నా అభిప్రాయం. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా 31 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మీరు మీ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక సమాచారం మొత్తాన్ని నిశితంగా గమనించినప్పుడు ఆ వ్యక్తుల (జగన్, అజేయ కల్లం) ప్రవర్తన ధిక్కారపూర్వకంగానే ఉంది. ఈ అంశం ప్రధాన న్యాయమూర్తి పరిధిలోఉన్నందున దీనిలో జోక్యం చేసుకోవడం నాకు తగదు. అందువల్ల, సుప్రీంకోర్టు ధిక్కరణ నేరంకింద ప్రొసీడింగ్స్ మొదలు పెట్టడానికి తిరస్కరిస్తున్నా' అని వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
కళాశాలల్లో సీట్ల కుదింపు జీవో సస్పెన్షన్