కనీస టైం స్కేల్ అమలుకు కోర్టు ఆదేశించినా.... అధికారులు పట్టించుకోలేదని రాజమహేంద్రవరం ఎస్కేఆర్ కళాశాల అటెండర్ పాపారావు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. వ్యాజ్య ఉపసంహరణకు.... కళాశాల కరస్పాండెంట్ రామ్మోహనరావు ఒత్తిడి చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆగ్రహించిన ధర్మాసనం....చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి..... ఉపసంహరణకు ఒత్తిడి చేస్తారా అని ప్రశ్నించింది.
ఓ అటెండర్‌కు కనీస టైం స్కేల్ అమలు చేయాలని ఇచ్చిన ఆదేశాల్ని మూడేళ్ల పాటు అమలు చేయకపోవడం సరికాదని ఆగ్రహించింది. అటెండర్ చిరుద్యోగి కాబట్టి పట్టించుకోవడం లేదా అని నిలదీసింది. రాజ్యాంగం అందరికీ ఒకే హక్కులను ప్రసాదించిందని గుర్తు పెట్టుకోవాలంది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలున్నా రాకుండా... హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అనుబంధ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. దేవదాయశాఖ కమిషనర్ అర్జున్ రావు, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ ఎమ్ఎమ్ నాయక్, కళాశాల విద్య రాజమహేంద్రవరం ఆర్జీడీ డేవిడ్ కుమార్‌పై తొలుత నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరపర్చాలని ఆదేశించింది. మధ్యాహ్నం వారు హాజరవుతారని....ఎన్బీడబ్ల్యూ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది కోరటంతో.... విచారణను కొద్దిసేపు వాయిదా వేసింది.