Jyothi Yerraji: మన దేశం తరఫున కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే బృందంలో చోటు దక్కించుకుంది.. విశాఖకు చెందిన యువతి జ్యోతి యర్రాజి. ఈ సందర్భంగా.. తనకు ఎదురైన అవరోధాలు, వాటిని అధిగమించిన తీరును‘వసుంధర’తో పంచుకుంది..
మాది విశాఖపట్నంలోని కైలాసపురం. నాన్న సూర్యనారాయణ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్, అమ్మ కుమారి. నాకో అన్నయ్య. బాగా చదువుకోమని ఇద్దరికీ చెబుతుండేవారు. నేను మాత్రం క్రీడల్లో పాల్గొని దేశానికి పేరు తేవాలనుకునేదాన్ని. ఇంట్లో చెబితేనేమో ఆటలొద్దనేవారు. పోర్ట్ హైస్కూల్లో చదివేదాన్ని. అక్కడ పీఈటీ సర్ ప్రోత్సాహంతో రన్నింగ్, లాంగ్‌జంప్, హర్డిల్స్‌లో ప్రాక్టీసు చేసేదాన్ని. నా ఎత్తుకు హర్డిల్స్ బావుంటుందన్నారు సర్.
అది 2015... నేను పదో తరగతిలోకి వచ్చా. ప్రాక్టీసుకి వెళ్తుంటే.. మావాళ్లు చదువుమీద మరింత దృష్టి పెట్టమనే వారు. చివరికోరోజు నా అథ్లెటిక్స్ లక్ష్యం గురించి చెప్పా. ఒక్కసారిగా వాళ్లకు కోపం, భయం కమ్ముకొచ్చాయి. నా భవిష్యత్తు ఏమవుతుందోననేది వాళ్ల ఆందోళన. నా పట్టుదల చూసి చివరకు రెండేళ్లలోపు రాణించలేకపోతే ఆటలు వదిలేయాలన్నారు. ఆరు నెలల తర్వాత కేరళలో జరిగిన జూనియర్ యూత్ నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో 100మీ. హర్డిల్స్‌ని 14.6 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణం సాధించా. అప్పుడు అందరూ మెచ్చుకోవడం, నా గురించి పత్రికల్లో, టీవీల్లో రావడంతో అమ్మానాన్నల ఆలోచన మారింది.
షూ కొనమని అడగలేకపోయా..హర్డిల్స్ ప్రాక్టీసుకి ఎక్కువ శక్తి అవసరం.. దాంతో ఆకలి బాగా వేసేది. సాధన తర్వాత నిస్సత్తువ ఆవరించేది. ఇంట్లో నా కోసం ప్రత్యేకంగా ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. అందరికీ ఏది వండితే అదే తినాలి. కాకపోతే కాస్త ఎక్కువ తినేదాన్ని. అరటి పళ్లు చౌకగా దొరకడంతో వాటితోనే ఆకలి తీర్చుకునేదాన్ని. పోటీలకు వెళ్లే ప్రతిసారీ ఖర్చులకి ఇబ్బంది. ఎవరో ఒకరు సాయపడితే ఆరోజు కష్టం గట్టెక్కేది. అదీకాక నాణ్యతలేని షూతోనే పరిగెత్తడంతో కాలి మడమ మెలి తిరగడం, కాళ్లకు దెబ్బలు, వెన్నుపూస నొప్పి వంటివి బాధించేవి.
నాన్న నెల జీతం అంతా ఖర్చు పెడితే కానీ స్పైక్ షూ కొనలేం. అందుకే వారికీ విషయమే చెప్పలేదు. అలాగని పోటీలకు వెళ్లకపోతే ఎదుగుదల ఉండదు. వీటన్నింటినీ పంటి బిగువున భరిస్తూనే ముందుకెళ్లేదాన్ని. ఒక స్పాన్సర్ స్పైక్ షూ బహూకరించడంతో గాయాలు తగ్గాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లోని శాయ్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యా. అప్పుడు పరిస్థితులు కాస్త నయమయ్యాయి. చదువూ వదల్లేదు.. ఇంటర్ కూడా పూర్తిచేశా.