రాష్ట్రంలో పూర్వస్థితి రావాలంటే తెదేపా అధికారంలోకి రావాలి ATCHANNAIDU: గ్రామాల్లో వైకాపా నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజలు అడిగే వాటికి వైకాపా నాయకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఒంగోలులో మహానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా? అని అచ్చెన్న మండిపడ్డారు. స్టేడియం ఇవ్వకపోతే మండువవారిపాలెంలో స్థలం ఎంపిక చేశామని తెలిపారు. మహానాడులో 17 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. సమాజ హితం కోసం పని చేస్తున్న పార్టీ తెలుగుదేశం అని.. రాష్ట్రంలో పూర్వస్థితి రావాలంటే తెదేపా అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
వైకాపా గాలి పార్టీ.. అది గాల్లోనే కలిసిపోతుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఒంగోలు శివారులోని మండవవారిపాలెం వద్ద మహానాడు ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంగణంలో వేదిక, గ్యాలరీ, పార్కింగ్ ఏర్పాట్లు ఎలా చేయాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహానాడు నిర్వహణకు భూములు ఇచ్చిన మండవవారిపాలెం ప్రజలతో మాట్లాడి.. భూములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు ఎక్కడైనా విజయవంతం అవుతుందని.. అది రుజువు చేయడానికే ఈసారి ఒంగోలులో నిర్వహిస్తున్నామని చెప్పారు.
మహనాడును విజయవంతం చేయడానికి, నాయకులతోపాటు, కార్యకర్తలు, గ్రామస్థులు సహకారం అందించాలని కోరారు. మహానాడుకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గుంటూరు నుంచి ఒంగోలు వరకు వివిధ ప్రాంతాల్లో బస, వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 స్థానాల్లో విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడుతోపాటు ఎమ్మెల్సీ ఆశోక్బాబు, మాజీమంత్రి ఆళ్లపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్థన్, దామచర్ల సత్య, నియోజకవర్గ ఇంఛార్జ్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: "సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును.. వడ్డీతో సహా చెల్లించాల్సిందే"