Ramakrishna Family Suicide: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను విచారించారు. ఈ కేసులో పోలీసులు 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. దర్యాప్తు చేసినట్లు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
'' Palvancha Family Suicide:ఈ నెల 3వ తేదీన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి రామకృష్ణ తానూ నిప్పంటించుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వనమా రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే చనిపోతున్నట్లు వీడియోలో తెలిపారు. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. శుక్రవారం రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నాం.
భద్రాద్రి కొత్తగూడెంలోని దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశాం. రాఘవతో పాటు గిరీష్, మురళిని అరెస్ట్ చేశాం. రాఘవ పరారయ్యేందుకు చావా శ్రీనివాస్, రమాకాంత్ సహకరించారు. పలు అంశాలపై రాఘవను విచారించాము. రామకృష్ణను బెదిరించినట్లు అతను ఒప్పుకున్నాడు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాం. కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు రాఘవను హాజరుపరుస్తాం. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి. గతంలో నమోదైన కేసులపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం.'