ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రైతన్న సగటు రుణం 2,45,554 - రైతు కుటుంబాల సగటు అప్పులు

జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వే ప్రకారం 2018 నాటికి రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు తాజా నివేదిక తేల్చింది. దేశంలో ఎక్కువ రైతు కుటుంబాలపై అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలు అగ్రస్థానాల్లో నిలిచాయి.

National Statistical Office survey
రాష్ట్రంలో రైతన్న సగటు రుణం

By

Published : Sep 12, 2021, 6:18 AM IST

దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు అయిదేళ్లలో 57% పెరిగాయి. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వే ప్రకారం 2018 నాటికి దేశంలోని ఒక్కో రైతు కుటుంబం సగటు అప్పు రూ.74,121కి చేరింది. 2013నాటి రూ.47వేలతో పోలిస్తే ఇది 57% అధికం. అప్పుల ఊబిలో చిక్కుకున్న సగటు కుటుంబాల సంఖ్య 51.9% నుంచి 50.2%కి తగ్గినా, సగటు అప్పు మాత్రం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 93.2% రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554 అప్పు ఉన్నట్లు తాజా సర్వే నివేదిక తేల్చింది. తెలంగాణలో 91.7% రైతు కుటుంబాలు రుణపాశంలో చిక్కుకున్నాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై రూ.1,52,113 అప్పు ఉంది.

సగటున ఒక్కో రైతు కుటుంబంపై అత్యధిక రుణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో కేరళ (రూ.2,42,482), పంజాబ్‌ (రూ.2,03,249) ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. దేశంలో సగటున 69.6% రైతు కుటుంబాలకు సంస్థాగత రుణాలు అందుతుండగా, ఇలాంటి రుణాలు ఏపీలో 49.6%, తెలంగాణలో 42.5% మందికే అందాయి. దానివల్ల వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏపీలో వ్యవసాయ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నవారు 31.1% ఉండగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవారు 15.4% మంది ఉన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి
రుణం ఇచ్చేవారి నుంచి 9.1% మంది తీసుకోగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి 41.3% మంది రుణాలు అందుకున్నారు. ఇలా తీసుకునేవారి సంఖ్య దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఉంది. వాణిజ్య బ్యాంకుల నుంచి దేశంలో సగటున 44.5% కుటుంబాలకు రుణాలు అందుతుండగా, ఏపీలో అది 34.1%, తెలంగాణలో 24.8%కే పరిమితమైంది.

దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల్లో కేవలం 57.5% మొత్తాన్ని వ్యవసాయ అవసరాలకు, మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఏపీలో 60.3%, తెలంగాణలో 63% మొత్తాన్ని వ్యవసాయం కోసమే ఉయోగిస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అత్యధిక అప్పుల్లో కూరుకుపోయింది దక్షిణాది రైతు కుటుంబాలే. జాతీయ సగటు అప్పు రూ.74,121తో పోలిస్తే ఏపీలోని ఒక్కో కుటుంబంపై 221%, తెలంగాణలోని కుటుంబంపై 105% అధిక అప్పు ఉంది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ఇదీచదవండి...

ABOUT THE AUTHOR

...view details