Yadadri Temple Reopening : తెలంగాణలోని యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలోని గర్భాలయ మూలవరులను కనులారా దర్శించుకోవాలన్న భక్త జనుల కోరిక తీరే తరుణం ఆసన్నమవుతోంది. వందరోజుల్లో వారి కలనెరవేరబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో పునర్నిర్మితమవుతున్న యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ వచ్చే ఏడాది మార్చి 28న చేపట్టాలని చినజీయర్ స్వామి ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రతువు పూర్తయ్యాకే గర్భాలయంలో నారసింహుని చూసే భాగ్యం దక్కుతుంది. మహాకుంభ సంప్రోక్షణకు ముందస్తుగా వారంపాటు నిర్వహించే శ్రీసుదర్శన మహాయాగం కోసం ఏర్పాట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామితో త్వరలో వస్తారని అధికారులు చెబుతున్నారు.
సంపూర్ణ కృష్ణశిలతో ప్రధానాలయం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక మహాదివ్య క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. యాదాద్రి కొండపైన 14 ఎకరాల విస్తీర్ణంలో గల ప్రాంగణాన్ని రూ.165 కోట్ల వ్యయంతో 20 ఎకరాలకు విస్తరించారు. అరెకరంలో ఉన్న ప్రధాన ఆలయాన్ని మాడవీధులు, అష్టభుజి మండప ప్రాకారాలతో 4.03 ఎకరాలకు విస్తరించి పునర్నిర్మించారు. సంపూర్ణంగా కృష్ణశిలతో దాదాపు రూ.వెయ్యి కోట్ల ఖర్చు చేసి ప్రధానాలయాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ధ్వజస్తంభానికి స్వర్ణ కవచాలు బిగిస్తున్నారు. గోపురాలపై కలశాల స్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాడవీధుల్లో ఫ్లోరింగ్ పనులు పూర్తికావొస్తున్నాయి. అద్దాల మండపం తుది దశలో ఉంది. గర్భాలయంలోని ప్రధాన ద్వారానికి పసిడి కవచాల బిగింపు పూర్తయ్యింది. ఏడు రాజగోపుర ద్వారాలకు ఇత్తడి తొడుగుల అమరిక జరుగుతోంది. విమానాన్ని స్వర్ణమయం చేయాల్సి ఉంది. సాలహారాల్లో అష్టదిక్పాలకుల విగ్రహాలను పొందుపరచాలి. విద్యుదీకరణ ప్రయోగాత్మక పరిశీలన జరుగుతోంది.
ఆధ్యాత్మికం.. ఆహ్లాదభరితం
ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శివాలయాన్ని పునర్నిర్మించారు. పరిసరాల్లోనే విష్ణు పుష్కరిణి, ప్రసాదాల తయారీ, విక్రయ సముదాయం, క్యూ కాంప్లెక్స్ కడుతున్నారు. పసిడి వర్ణంతో కూడిన ఇత్తడి దర్శన వరుసలు ఏర్పాటయ్యాయి. బ్రహ్మోత్సవ మండపం నిర్మించారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేశారు. కొండ చుట్టూ పచ్చని మొక్కలు నాటి ఆహ్లాదకరంగా రూపొందిస్తున్నారు.