Medaram Jatara 2022: తెలంగాణలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం మహాజాతర కొవిడ్ వేళ వైద్య ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు సుమారు కోటిమంది తరలివస్తారని అంచనా వేశారు. ఇప్పటికే వేలాదిగా భక్తుల రాక మొదలైంది. కొవిడ్ మూడోదశ ఉద్ధృతంగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆందోళన నెలకొంది. జాతరకు వచ్చేవారంతా కరోనా నిబంధనలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది. అందువల్ల భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉన్నందున.. లక్షల్లో మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఒకవేళ కొవిడ్ తీవ్రత పెరిగి ఎవరికైనా అత్యవసర చికిత్స అందించాల్సి వస్తే.. ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దాసుపత్రులు ములుగు, ఏటూరునాగారంలో ఉండగా.. జాతర రద్దీలో అంత దూరం తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల మేడారంలోనే కొవిడ్ ఆసుపత్రి ఏర్పాటుపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు.
జాతర నిర్వహణలో వైద్య సిబ్బంది
జాతర నిర్వహణలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సుమారు 1100 మంది వరకు ఉన్నారు. వీరిలో 150 వరకు వైద్యులు. గత జాతరలో దాదాపు ఇంతే సంఖ్యలో వెద్య సిబ్బంది పనిచేశారు. ఈసారి కొవిడ్ నేపథ్యంలో వీరి సంఖ్య పెంచడంపై దృష్టి సారించాలని చెబుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్నవారిలో ఇప్పటికే 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్నందున గద్దెల ప్రాంతంతోపాటు జంపన్నవాగు, గిరిజన మ్యూజియం తదితర ప్రాంతాల్లో శానిటైజేషన్ నిరంతరం కొనసాగాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతరకు రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు మాత్రమే రావాలనే ప్రతిపాదన పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.