New Districts: పరిమిత నిధులతో రాష్ట్రంలో కొత్త జిల్లాల కార్యాలయాలకు వసతులు ఎలా కల్పించాలన్నదానిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో 70 ప్రభుత్వ శాఖలు, 140 వరకు కార్యాలయాలు ఉంటాయి. ఈ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు తుది దశకు వచ్చింది. ఎంపిక చేసిన కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఒక్కో కొత్త జిల్లాకు రూ.3 కోట్లు మాత్రమే కేటాయించింది. భవనాల్లో క్యాబిన్ల ఏర్పాటు, సున్నం వేయించడం, రంగులద్దడం, సీలింగ్, కంప్యూటర్లు, ఫర్నిచర్ వంటి వాటిని సమకూర్చేందుకు, ఫర్నిచర్‌ను పాత జిల్లాల నుంచి తెప్పించేందుకు ఆ నిధులు సరిపోవడంలేదని అధికారులు వాపోతున్నారు.
ఖరారైన భవనాల దగ్గర కొత్త జిల్లాల పేర్లతో (కలెక్టర్/జిల్లా మేజిస్ట్రేట్) బోర్డులూ వెలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి సామగ్రినీ తరలిస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు లేని శాఖలకు ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటున్నారు. కొన్నాళ్లపాటు వివిధ ప్రభుత్వ శాఖలను ప్రస్తుత జిల్లాలోనే ఉంచి, కార్యకలాపాలను కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. విజయనగరంలో ఇలాగే చేస్తున్నారు.
విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలు
విద్యా సంస్థల భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించినా పలుచోట్ల అందుకు భిన్నంగా సాగుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలో 50 శాతానికిపైగా కార్యాలయాలను సత్యసాయి ట్రస్టు భవనాల్లో ఏర్పాటు చేయనున్నారు. పలు ప్రభుత్వ శాఖలను కొత్త చెరువులోని బీసీ బాలికల వసతి గృహాన్ని, బుక్కపట్నంలోని డైట్ కళాశాల భవనాలను సిద్ధం చేస్తున్నారు. కొత్త చెరువులో వసతి గృహానికి భవనాన్ని 2018లో రూ.80 లక్షలతో నిర్మించారు. నాలుగేళ్ల నుంచి నిరుపయోగంగా ఉంటోంది.