ఖైరతాబాద్ గణేషుడు సాగరాన్ని చేరే సమయం ఆసన్నమైంది. 60 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణనాథుడు.. ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహాగణాధిపతిగా కనువిందు చేశాడు. నిత్యం వందల సంఖ్యలో భక్తులు మహాకాయుడిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారు. ఇక తొమ్మిది రోజుల పాటు సాగిన ఉత్సవాలు నేడు నిమజ్జన కార్యక్రమంతో ముగియనున్నాయి. వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ భక్తులు గణపయ్యను ఏటా జయజయ ధ్వానాల మధ్య సాగనంపుతుంటారు. ఇందుకు తగినట్లే ఈ ఏడాదీ నిర్వాహకులు, ప్రభుత్వం సంయుక్తంగా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
శనివారం అర్ధరాత్రి నుంచే ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీ మీదకు ఎక్కించే పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం విజయవాడ నుంచి ట్రాలీ వచ్చింది. ముందుగా మహా గణపతి విగ్రహానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ విగ్రహాలను ట్రాలీలపైకి చేరుస్తారు. అనంతరం భారీ క్రేన్ సహాయంతో మహా గణపతిని ట్రాలీపైకి చేర్చి వెల్డింగ్ పనులను నిర్వహిస్తారు. ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఏడు గంటల తర్వాత ఖైరతాబాద్ నుంచి విగ్రహం టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుంటుంది. 4వ నెంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణపయ్యను గంగ ఒడికి చేర్చనున్నారు.