పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదలకు సమాయత్తం అవుతున్నట్లు పథకం పర్యవేక్షణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వరప్రసాద్ గురువారం చెప్పారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 14.01 మీటర్లుగా ఉందని, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల రానున్న వారం రోజుల్లో నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందన్నారు.ఎత్తిపోతల పథకంలోని 24 పంపుల్లోని మూడు పంపులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. మిగిలిన 21 పంపులు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నడపడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కృష్ణా డెల్టా జలవనరుల శాఖాధికారుల సూచనల మేరకు వారికి అవసరమైన నీటి వినియోగాన్ని బట్టి పంపులు ఆన్ చేస్తామని వరప్రసాద్ వెల్లడించారు.
మరోవైపు ఇటుకలకోటలో కుడి కాలువపై నిర్మించిన డెలివరీ సిస్టమ్ పంపుల వద్ద ఇసుక నిల్వల తరలింపు ముమ్మరంగా జరుగుతోందన్నారు. గతేడాది జూన్ 26న ఎత్తిపోతల పథకంలో మూడు పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు.