Arogyashree services: తెలంగాణలో ఆరోగ్యశ్రీ - ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రత కార్డును కూడా చెల్లుబాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరోగ్య శ్రీ కార్డులూ అందజేశారు. అనంతర కాలంలో ప్రభుత్వం రేషన్ కోసం తెల్ల కార్డు స్థానంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసింది. వీటిని కేవలం రేషన్ కోసం మాత్రమే పరిమితం చేశారు. ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్‌లో చికిత్సలు పొందాలంటే.. సంబంధిత కార్డులైనా ఉండాలి. లేదా తెల్ల రేషన్ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి. గతంలోనే ఆరోగ్యశ్రీ కార్డులున్న సుమారు 77 లక్షల కుటుంబాలు వాటితో వైద్యసేవలు పొందే వెసులుబాటు ఇప్పటికే ఉంది. కానీ, ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.
చికిత్స అవసరమైనప్పుడు ఈ కార్డుదారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆమోదముద్ర పొందాల్సి వస్తోంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఈ సమస్యపై ప్రజల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు దఫాలుగా 10 లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను అందజేశాం. వీరికి ఆరోగ్యశ్రీ సేవలు లభించకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో స్పందించి, తక్షణమే ఆ కార్డుదారులకు కూడా వర్తింపజేయాలని ఆదేశించారు. అందువల్ల ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులన్నీ ఇకపై ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులను కూడా ఉచిత చికిత్సలకు అనుమతించాలి’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..