సంగం డెయిరీ స్వాధీన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో జారీచేసిన జీవో అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఏపీడీడీసీ)/ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 27న జీవో 19 జారీచేసింది. ఆ జీవోను సవాలు చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌ఎంపీసీఎల్) డైరెక్టర్ ధర్మారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దానిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. జీవో 19ని నిలుపుదల చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎస్‌సీఎస్) అప్పీల్ వేశారు. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బుధవారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. జీవో అమలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను
ధర్మాసనం సమర్థించింది. డెయిరీకి
సంబంధించిన స్థిర, చరాస్తుల బదిలీ, తనఖా, అన్యాక్రాంతం చేసే విషయంలో ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలని సింగిల్ జడ్జి సంగం యాజమాన్యానికి షరతు విధించారని గుర్తుచేసింది. ఆస్తులు రక్షించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధమైన ఉత్తర్వులిచ్చారని తెలిపింది. ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఆ ఉత్తర్వులున్నాయని వివరించింది. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాకే సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంది. ఆ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవడానికి సరైన కారణాలు లేవని వెల్లడించింది. ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జీవోను సమర్థిస్తూ ‘గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ సంఘం-జీడీఎంపీఎస్’ దాఖలు చేసిన మరో అప్పీల్‌ను సైతం ధర్మాసనం కొట్టేసింది.