జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హెటిరో కంపెనీతోపాటు డైరెక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు మంగళవారం ముగిశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పును వాయిదా వేశారు. హెటిరో తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలను తొక్కిపెట్టి తనకు అవసరమైన వాటినే తీసుకుంది. సీబీఐ వాదనలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల నుంచే ప్రారంభించింది. వారిద్దరూ పెట్టుబడులకు పథక రచన చేశారని వాదించింది.
"వారి వ్యవహారంతో మాకు (హెటిరోకు) ఎలాంటి సంబంధమూ లేదు. అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని మేం వ్యతిరేకించలేదు. కంపెనీ వ్యవహారాల్లో డైరెక్టర్ పాత్రను తీసుకోవడాన్నే ప్రశ్నించాం. జగతిలో పెట్టుబడులు మా కంపెనీకి చెందినవి. అవి మా విచక్షణ మేరకే ఉంటాయి. హెటిరోకు ప్రభుత్వం భూమి కేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రస్తావించాలి తప్ప, పెట్టుబడుల గురించి కాదు. సీబీఐ దర్యాప్తు అనుచితంగా ఉంది" అని పేర్కొన్నారు. దీనిపై రాతపూర్వక వాదనలు సమర్పించాలని పిటిషనర్లతోపాటు సీబీఐని ఆదేశిస్తూ న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.