ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆక్వా సాగుకు గడ్డుకాలం.. పడిపోతున్న ధరలు

ఆక్వా సాగు పతనమవుతోంది. చేపలతో పాటు రొయ్యనూ కష్టాలు కమ్మేశాయి. ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంతో రొయ్యల కొనుగోలు ఒక్కసారిగా నిలిచింది. ప్రాసెసింగ్‌ ప్లాంట్లు మూతపడటంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సడలింపుల తర్వాత పాక్షికంగా ప్లాంట్లు తెరిచారు. కొనుగోలు మొదలైందనుకునే సమయంలో జులై మొదటి వారం నుంచి మళ్లీ కష్టాలు చుట్టుముట్టాయి. జులై మొదటివారంతో పోలిస్తే మూడో వారానికి 100 కౌంటు రొయ్యల ధర కిలోకు రూ.110 తగ్గింది. ఎకరా సాగు చేస్తే రూ.2 లక్షల వరకు నష్టాలు తప్పడం లేదు. ఏడాదికి రూ.50 వేల కోట్ల జీవీఏను అందించే మత్స్యరంగం భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది.

aqua farmers problems in ap
aqua farmers problems in ap

By

Published : Jul 28, 2020, 5:51 AM IST

దెబ్బతీస్తున్న తెల్లమచ్చ..

వానాకాలం కావడంతో రొయ్యలను తెల్లమచ్చ వైరస్‌ ఆశిస్తోంది. కృష్ణా జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ. ఒక చెరువు నుంచి మరో చెరువుకు ఇది విస్తరిస్తోంది. రొయ్య పిల్లలు వేసిన 25 రోజులకే వైరస్‌ ఆశించడంతో నాలుగెకరాల చెరువును వదిలేయాల్సి వచ్చిందని ఓ రైతు వాపోయారు. విత్తనం వేసే సమయంలోనే పీసీఆర్‌ పరీక్ష చేయించడంతోపాటు నీటిని వదిలాక 25 నుంచి 30 పీపీఎం బ్లీచింగ్‌తో శుద్ధి చేయాలని విశ్రాంత శాస్త్రవేత్త రామ్మోహన్‌రావు సూచించారు.

చైనాతో చిక్కు

చైనా తన అవసరాల్లో 55% రొయ్యలను ఈక్వెడార్‌ నుంచి, 30%పైగా భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. జులై రెండో వారంలో ఈక్వెడార్‌ నుంచి వచ్చిన రొయ్యల ప్యాకేజీపై కరోనా గుర్తించామంటూ కంటెయినర్లను వెనక్కి పంపింది. భారత్‌ నుంచి వెళ్లిన రొయ్యల్లో అలాంటివేమీ గుర్తించలేదు. అయినా దిగుమతి చేసుకోవడం లేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తత, చైనా యాప్‌ల నిషేధం తదితర పరిణామాలూ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈక్వెడార్‌కు ఎదురైన పరిస్థితులను గమనించి ఇక్కడా ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు మోహన్‌రాజు సీఎంకు రాసిన లేఖలో కోరారు.

40% తగ్గిన ఎగుమతులు

రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 90% చైనాతోపాటు అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలకు ఎగుమతవుతాయి. అయితే కొవిడ్‌ పరిణామాలతో మార్చి నుంచి మందగమనం మొదలైంది. గతేడాది ఏప్రిల్‌- జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది 40% ఎగుమతులు తగ్గాయని ఆనంద గ్రూప్‌ రామకృష్ణరాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గుంటూరు జీజీహెచ్‌లో నిండిపోయిన శవాగారం!

ABOUT THE AUTHOR

...view details