ఉద్యోగ, ఉపాధ్యాయ, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, పింఛన్‌దారులకు పీఆర్సీలో జరుగుతున్న నష్టాన్ని సరిదిద్దాలని కోరుతూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, డీఆర్వో, జేసీలకు శుక్రవారం ఉపాధ్యాయులు వినతిపత్రాలు సమర్పించారు. విజయవాడలో సబ్ కలెక్టర్‌కు ఫ్యాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు, కో ఛైర్మన్ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యుడు ప్రసాద్ వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఫిట్‌మెంట్ పెంచాలని, పీఆర్సీ నష్టాన్ని సరిదిద్దాలని నినాదాలు చేశారు.
‘చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించింది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా 23శాతం ఫిట్‌మెంట్, జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు, సీపీఎస్ తదితర అంశాలపై విభేదించాయి. వీటితోపాటు ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణపై మంత్రుల కమిటీ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో 13లక్షల ఉద్యోగులకు నష్టాన్ని కలిగిస్తోంది. దీనిపై సీఎం జగన్ పునఃసమీక్షించాలి’’ అని ఉపాధ్యాయులు విన్నవించారు.