ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSRTC On Bus Accident: ఆ వార్తలు అవాస్తవం.. బస్సు ప్రమాదంపై ఆర్టీసీ బృందం విచారణ! - apsrtc team investigate on bus accident

APSRTC On Bus Accident: పశ్చిమగోదావరి జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది ఆర్టీసీ. ఈ మేరకు అధికారుల బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. స్టీరింగ్ పట్టేయడంతోనే ప్రమాదం జరిగిందన్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు అభిప్రాయపడింది. పూర్తిస్థాయి విచారణలో కారణాలు తెలుస్తాయని పేర్కొంది.

APSRTC On Bus Accident
APSRTC On Bus Accident

By

Published : Dec 16, 2021, 5:34 PM IST

Updated : Dec 16, 2021, 5:57 PM IST

APSRTC On Bus Accident: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వాగులో బస్సు ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని.. పలు అంశాలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి.. జీలుగుమిల్లి మండల లక్ష్మీపురం వరకు రహదారి పరిస్థితిని పరిశీలించారు. పలుచోట్ల గోతులు ఉండటం.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉండటాన్ని గమనించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఇన్​ఛార్జి ఈడీ రవికుమార్, రీజినల్ మేనేజర్ వీరయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు.

స్థానికుల నుంచి ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. బస్సులో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. ప్రతిరోజూ అన్ని బస్సులనూ తనిఖీ చేస్తారని.. ఏమైనా లోపాలు ఉంటే మరమ్మతులు చేపడుతారని తెలిపారు. బస్సు స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగింది అనేది పూర్తిగా అవాస్తవమ‌న్నారు. బస్సు.. 3 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని, ఇంకా కాలపరిమితి ఉందని పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు. ప్ర‌మాదంపై ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు అదేశాల మేర‌కు.. తూర్పు, ప‌శ్చిమగోదావ‌రి జిల్లాల్లోని టెక్నిక‌ల్ విభాగానికి చెందిన సీనియ‌ర్ల‌తో క‌మిటీ వేసి పూర్తిస్థాయి విచారణ చేయిస్తామ‌ని ఈడీ వివరించారు.

బస్సు ప్రమాదంలో 10 మంది మృతి.. ఏం జరిగిందంటే..
Bus Accident in Andhra pradesh: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన దగ్గర బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆప్తులను కోల్పోయిన వారి వేదన, గాయాలు మిగిల్చిన ఆవేదన, కాపాడండి... అనే ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జల్లేరు వాగు రక్తపు మడుగులా మారింది. వేలేరుపాడు నుంచి భద్రాచలం మీదుగా జంగారెడ్డిగూడెం వస్తున్న ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. ఉదయం 11.45 గంటలకు బస్సు గమ్య స్థానానికి చేరుకోవాల్సి ఉండగా 12.00 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 9 మంది పశ్చిమగోదావరి జిల్లావాసులు కాగా... ఒకరిది తూర్పుగోదావరి జిల్లా. 25 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్న వారు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. యువకులు జల్లేరులో దిగి సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని పడవల ద్వారా బస్సు వద్దకు చేరుకుని కొందరిని రక్షించారు. మృతదేహాలను వెలికి తీశారు.

మృతుల వివరాలివీ..
మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. ఆడమిల్లి జాన్‌మోజెస్‌ (52), ఎం.లక్ష్మి(40), పొడపాటి దుర్గమ్మ(55), ఉండ్రాజవరపు సరోజిని (56), బడుగు సత్యవతి(58), శ్రీరాముల బుల్లెమ్మ(45), కేతా వరలక్ష్మి(62), బస్సు డ్రైవర్‌ సాలుమూరి చిన్నారావు(46), పాలడుగుల మహాలక్ష్మి(45), తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన సోమరాజు(55) మృతుల్లో ఉన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, 5 లక్షల పరిహారంసీఎం జగన్‌ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

ఆర్టీసీ నుంచి రూ.2.50 లక్షల చొప్పున పరిహారం

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు ప్రకటించారు. ఘటన స్థలాన్ని కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామన్నారు. ఇది కాలం చెల్లిన బస్సు కాదని 2019లో కొన్నదేనని, లాక్‌డౌన్‌ కారణంగా ఏడాదికి మించి తిరగలేదన్నారు.

సమగ్ర విచారణకు మంత్రి ఆదేశం

బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు.

ఇదీ చదవండి

Bus Accident: జల్లేరులో జల విషాదం..వాగులో పడిన ఆర్టీసీ బస్సు..10 మంది మృతి

Last Updated : Dec 16, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details