సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ తిప్పే వివిధ రకాల బస్సుల్లో మరో బస్సు సర్వీసు చేరింది. డాల్ఫిన్ క్రూయిజ్ పేరిట అధునాతన ఏసీ సర్వీసును ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ నాన్ ఏసీ విభాగంలో ఎక్స్ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఉండగా.. ఏసీ విభాగంలో ఇంద్ర, గరుడ, వెన్నెల, నైట్ రైడర్, అమరావతి ఉన్నాయి. అయితే వీటన్నింటినీ మించి డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లో సదుపాయాలు ఉండనున్నాయి. సంస్థకు దూర ప్రాంతాలకు నడిపే సర్వీసుల వల్లే ఎక్కువ ఆదాయం వస్తుండడం వల్ల అధికారులు కొత్త సర్వీసును రోడ్డెక్కించాలని భావిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, కుదుపుల్లేని, వినోదంతో కూడిన ప్రయాణాన్ని ఈ బస్సులు అందించనున్నాయి.
డాల్ఫిన్ సర్వీసు ప్రత్యేకతలివే..!
- ఆర్టీసీలో ఇప్పటివరకూ ఉన్న మల్టీ ఆక్సిల్ బస్సుల కంటే పొడవుగా ఉండి.. ఎక్కువ మంది ప్రయాణానికి అనుకూలం.
- ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా.. ఎల్ఈడీ తెరలు, పూర్తి ఏసీ, అధునాతన కుషన్ సీట్లు, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లు సహా సాధారణ రోజుల్లో బ్లాంకెట్, వాటర్ బాటిల్ సదుపాయం.
- బీఎస్ - 4 స్టాండర్డ్ కలిగిన వాహనం.. బస్సు నుంచి తక్కువ మోతాదులో పొగ విడుదల. కుదుపుల్లేకుండా ప్రయాణం.
- తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించేలా ఇంజిన్ సామర్థ్యం.