electric buses: పెరుగుతోన్న డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకోవడంపై ఏపీఎస్ ఆర్టీసీ దృష్టి పెట్టింది. సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులను క్రమంగా పెంచాలని నిర్ణయించింది. అయితే ఎలక్ట్రిక్ బస్సుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల... డీజిల్ బస్సులనే ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
electric buses: డీజిల్ బస్సులకు క్రమంగా పక్కనబెట్టి ..ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతించేందుకు ఆర్టీసీ ముందడుగు వేస్తోంది. ఇంధన ధరలు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా నిర్వహణ వ్యయం తగ్గించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించిన ఆర్టీసీ.... ఇప్పటికే తిరుమల తిరుపతి మధ్య 150 ఇ-బస్సులను ప్రవేశ పెట్టేందుకు టెండర్లు ఖరారు చేసింది. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ... డీజిల్ బస్సుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. దశల వారీగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
electric buses: ఆర్టీసీలో ప్రస్తుతం 12 వేల బస్సులుండగా అవన్నీ డీజిల్‌తో నడిచేవే. అన్ని బస్సులను ఒకేసారి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో సంస్థకు సాధ్యపడదని నిర్ణయించారు. వీటిలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నీ తక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. దీంతో పాటు మరో పదేళ్ల జీవిత కాలం ఉన్న 2 వేల డీజిల్ బస్సులు ఉన్నాయి. వీటిని దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. పాత డీజిల్ బస్సులను E- బస్సులుగా మార్పు చేసేందుకు సిద్దపడుతోంది. దీనికోసం రెట్రె ఫిట్ మెంట్ ప్రాజెక్టును చేపట్టనుంది.
"ప్రయోగాత్మకంగా చాలా ప్రాంతాల్లో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని ఆర్టీసీలు ఈ ఆలోచన చేస్తున్నా... విజయం సాధిస్తామా లేదా అన్న అనుమానంతో ముందుకు రావడంలేదు. త్వరలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక 100 బస్సులు డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ విధానంలోకి మారుస్తాం. డీజిల్ ధరలు పెరిగినా... విద్యుత్ ధరలు అంతగా పెరిగే అవకాశం లేదు. పర్యావరణానికి నష్టం కలగకుండా, అన్ని వసతులతో నాణ్యమైన సేవలు అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి" -ద్వారకా తిరుమల రావు, ఆర్టీసీ ఎండీ