ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు
15:24 April 13
ఆర్టీసీ ఛార్జీలు పెంపు
డీజిల్ సెస్ పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటి వరకు రూ.5 ఉన్న కనీస టిక్కెట్ ధర డీజీల్ సెస్ రూ.2, సేఫ్టీ సెస్ రూ.1 తో కలిపి రూ.8కి పెరిగింది. చిల్లర సర్దుబాటుతో అదనంగా మరో రూ.2 రూపాయల భారం విధించింది. ఫలితంగా పల్లెవెలుగు బసుల్లో కనీస టిక్కెట్ ధర రూ.10కి పెరిగింది. మొత్తంగా ఈ పెంపుతో ఆర్టీసీకి ఏటా రూ.720 కోట్ల ఆదాయం వస్తుందని.. సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కరోనా, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నామని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని చెప్పారు. పెరిగిన ధరలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
"ఆర్టీసీకి రెండేళ్లుగా ఆర్థిక కష్టాలు పెరిగాయి. డీజిల్ ధర రెండేళ్లలో రూ.67 నుంచి రూ.107కు చేరింది. బల్క్ ధర ఎక్కువగా ఉందని రీటైల్‌గా తీసుకుంటున్నాం. కరోనా వల్ల ఆర్టీసీకి 5,680 కోట్ల ఆదాయం తగ్గింది. ఆర్టీసీలో ప్రస్తుతం నిర్వహణ కూడా కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధిస్తున్నాం. ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తాం. కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటాం. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది.పెట్రో ధరలు, టైర్లు, ఇతర పరికరాల ధరలు కూడా బాగా పెరిగాయి." -ద్వారకా తిరుమల రావు, ఆర్టీసీ ఎండీ
ఇదీ చదవండి: స్కూళ్లు తెరిచే నాటికి "విద్యాకానుక".. సబ్జెక్టుల వారీగా టీచర్లు: సీఎం జగన్