APSRTC CHARGES HIKE : ‘డీజిల్ ధరల పెంపుదలతో వస్తున్న నష్టాల్ని తగ్గించుకునేందుకు స్వల్పంగా ఛార్జీలు పెంచేందుకు రూపకల్పన చేశాం. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడికి డీజిల్ సెస్ రూ.2, భద్రత సెస్ రూ.1 కలిపి రూ.3 మాత్రమే పెంచుతున్నాం. చిల్లర సమస్య లేకుండా మొత్తంగా రూ.5 పెంచాం’ అని ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ప్రకటించారు. కానీ గురువారం నుంచి పెంచిన ఛార్జీలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో తక్కువ దూరాలకు ఛార్జీలు రెట్టింపయ్యాయి. కొందరు ప్రయాణికులకు ఒక్కో టికెట్ ధరపై ఏకంగా రూ.15 భారం పడింది. పల్లెవెలుగు, సిటీ బస్సు ప్రయాణికులపైనే అడ్డగోలుగా బాదేశారు. గతంలో రూ.10 ఛార్జీ చెల్లించి ప్రయాణించేవారు ఇపుడు రూ.20, రూ.15 ఉండే ఛార్జీకి రూ.30 చొప్పున చెల్లించి జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది.
* విజయవాడ నుంచి 345 కి.మీ. దూరంలో విశాఖపట్నానికి సూపర్‌లగ్జరీ సర్వీసులో రూ.560 ఉన్న ఛార్జీ రూ.580 అయింది. పెరిగిన రూ.20లో.. డీజిల్ సెస్ రూ.10 అయితే మిగిలిన రూ.10 టోల్ ఛార్జీలది.
* అదే విజయవాడ నుంచి 65 కి.మీ. దూరంలో ఉన్న అవనిగడ్డకు పల్లెవెలుగు సర్వీసులో రూ.50 ఉన్న టికెట్ ధరను రూ.15 పెంచి రూ.65 చేసేశారు.
* విజయవాడలోని సిటీ ఆర్డినరీ సర్వీసులో ఆటోనగర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు ఛార్జీ రూ.10 మాత్రమే. ఇప్పుడు రూ.20 అయింది. ఆటోనగర్ నుంచి వైఎస్‌ఆర్ కాలనీకి రూ.15గా ఉన్న ఛార్జీ రూ.30కి చేరింది.
* ఆర్టీసీ డీజిల్ సెస్ రూపంలో ఓ క్రమపద్ధతి లేకుండా ఛార్జీలు పెంచి ప్రధానంగా పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో ప్రయాణించేవారిపై ఎంత భారం వేసిందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.
49 శాతం పల్లెలకు తిరిగే బస్సులే :ఆర్టీసీ నడిపే బస్సుల్లో గ్రామాలకు తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులే దాదాపు సగం ఉన్నాయి. సంస్థ బస్సులు, అద్దెవి కలిపి మొత్తం 11,299 బస్సులు ఉంటే అందులో 5,541 (49.04%) పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు సర్వీసులే. మిగిలినవాటిలో సిటీ సర్వీసులు 10.25 శాతం, ఏసీ బస్సులు 3.23 శాతం, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఘాట్లలో తిరిగే సర్వీసులు కలిపి 37.48 శాతం ఉన్నాయి. ఈ లెక్కన పల్లెవెలుగు, సిటీ సర్వీసులు కలిపి దాదాపు 60 శాతం ఉండగా, వీటిలో ప్రయాణించేవారికే అధిక భారం పడింది.
ఇష్టానుసారం పెంపు
ఓ విధానం అంటూ లేకుండా వివిధ ఆర్టీసీ సర్వీసుల్లో ఇష్టానుసారం ఛార్జీలు పెంచారు.
*కడప నుంచి 35 కి.మీ.దూరంలో ఉన్న మైదుకూరుకు ఛార్జీ రూ.40 ఉండగా రూ.45 చేశారు. అయితే కడప నుంచి మైదుకూరు మీదుగా ప్రొద్దుటూరుకు 55 కి.మీ. దూరానికి ఇప్పటి వరకు ఛార్జీ రూ.50 ఉండగా.. డీజిల్ సెస్‌తో కలిపి ఇప్పుడది ఏకంగా రూ.65 అయింది.
*అనంతపురం నుంచి 21 కి.మీ. దూరంలో ఉండే నార్పలకు పల్లెవెలుగులో రూ.20 ఛార్జి ఉండగా, ఇప్పుడు రూ.30 చేశారు.