ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గ్రూపు-1 ప్రిలిమ్స్‌ రద్దు చేయాలి'

ఏపీపీఎస్పీ పారదర్శకతను పెంచేందుకు సలహాలను స్వీకరించేందుకు కమిషన్ ఇన్​ఛార్జి కార్యదర్శి సీతారామాంజనేయులు సోమవారం విజయవాడలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతల పలు సూచనలు చేశారు. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు, గ్రూపు 1 ప్రిలిమ్స్ రద్దుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై పలు డిమాండ్లు చేశాయి.

appsc open house meet
'గ్రూపు-1 ప్రిలిమ్స్‌ రద్దు చేయాలి'

By

Published : Nov 26, 2019, 8:29 AM IST

ఏపీపీఎస్సీ సమావేశం
గ్రూపు-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలని కోరాయి. ఏపీపీఎస్సీ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడంలో భాగంగా సలహాలను స్వీకరించేందుకు కమిషన్‌ ఇన్‌ఛార్జి కార్యదర్శి సీతారామాంజనేయులు సోమవారం విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సదస్సులో విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ‘ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ను అమలుచేయాలి. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా తక్కువగా ఎంపిక చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌లో 75 అనువాద దోషాలు, 14 ప్రశ్నల తప్పులు దొర్లాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు నష్టపోయారు. వీటన్నింటికీ ఏపీపీఎస్సీ బాధ్యత వహించి ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలి’ అని నేతలు పేర్కొన్నారు. సమావేశంలో సూర్యారావు (డీవైఎఫ్‌ఐ), హేమంతకుమార్‌ (నిరుద్యోగ జేఏసీ), సుబ్రమణ్యం (నిరుద్యోగ ఐక్యవేదిక), సుబ్బారావు (ఏఐఎస్‌ఎఫ్‌) మాట్లాడారు. మౌఖిక పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ అన్వర్‌ ఆరోపించారు. పోటీరంగ నిపుణులు జేవీఎస్‌ రావు, సుభాన్‌ తదితరులు మాట్లాడారు.

ఎమ్మెల్సీల ఆగ్రహం
ఏపీపీఎస్సీ ధోరణి వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండిపడ్డారు. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఏపీపీఎస్సీ ఇష్ఠారీతిన వ్యవహరిస్తోందని మరో ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి ఆరోపించారు. గ్రూపు-1 ఇంటర్వ్యూల్లో పక్షపాతంగా వ్యవహరించారని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఎమ్మెల్సీలు ఆరోపించారు.

ప్రధాన డిమాండ్లు

  • తెలుగులోనే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలి.
  • ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో గ్రంథపాలకుల పోస్టులను భర్తీ చేయాలి.
  • గ్రూపు-1,2,3 పరీక్షలను ఒకే ఫీజుతో రాసే అవకాశం కల్పించాలి.
  • ‘స్పందన’ మాదిరి విజ్ఞప్తుల స్వీకరణకు ఏపీపీఎస్సీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
  • ప్రశ్నల్లో తప్పులున్నప్పుడు అభ్యర్థులకు నష్టం లేకుండా స్కేలింగ్‌ విధానాన్ని అమలు చేయాలి.
  • గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూపు-1లో కలిపేలా లోగడ జారీ చేసిన జీఓ 622, 623లను పూర్తిగా రద్దు చేయాలి.
  • వర్సిటీల పోస్టుల్లో ఏపీపీఎస్సీ జోక్యం తగదు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించినప్పుడు మార్కులను తెలుసుకునే సౌకర్యాన్ని కొనసాగించాలి.
  • మెరిట్‌ సాధించిన రిజర్వేషన్‌ అభ్యర్థులను ఓపెన్‌ కేటగిరి పోస్టుల్లోనే భర్తీ చేయాలి.

ABOUT THE AUTHOR

...view details