APPSC: రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరాలకు తగ్గట్లు నిధుల మంజూరుకాకపోవడంతో ఉద్యోగ నియామక రాత పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ ఉన్నట్లు సమాచారం. వివిధ నోటిఫికేషన్లు అనుసరించి సుమారు ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఫీజులు చెల్లించి, దరఖాస్తు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి నెలలు గడిచిపోతున్నా రాత పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ చడీచప్పుడు లేకుండా వ్యవహరిస్తుంది. దీంతో నిరుద్యోగులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సాధారణంగా నోటిఫికేషన్లలోనే రాత పరీక్షల తేదీలు ప్రకటిస్తారు. ఒకవేళ ఆ సమయానికి స్పష్టత లేకుంటే, నోటిఫికేషన్ల జారీ అనంతరం స్వల్ప వ్యవధిలోనే తేదీలు ప్రకటిస్తారు. ఇందుకు విరుద్ధంగా గత ఏడాది చివరి నుంచి వెలువడిన ప్రకటనలకు ఇప్పటివరకు రాత పరీక్షలకు తేదీలు ఏపీపీఎస్సీ ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రూ.90 కోట్లు అవసరం! :సచివాలయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..కమిషన్ సభ్యులు, ఉద్యోగుల వేతనాలు, పరీక్షల నిర్వహణకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సుమారు 90 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారని సమాచారం.. కానీ..సగం నిధుల కేటాయింపునకు మాత్రమే రాష్ట్ర ఆర్థిక శాఖ సుముఖత వ్యక్తంచేసింది. ఇవి కేవలం ఉద్యోగుల జీతభత్యాలకు మాత్రమే సరిపోతాయని తెలిసింది. ఏపీపీఎస్సీలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల తయారీ, ఇతర పనులు ఓ సాంకేతిక సంస్థ ద్వారా జరుగుతున్నాయి. ఈ సంస్థకు కోట్లాది రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి.
అభ్యర్థుల నుంచి ఫీజుల వసూళ్లు :పరీక్షల నిర్వహణకు తగ్గట్లు నిధులు లేనందున తేదీలు ప్రకటించేందుకు ఏపీపీఎస్సీ సాహసించలేకపోతోందని తెలిసింది. కొన్ని ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో జనరల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తు ప్రాసెస్ కోసం రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికోద్యోగుల కేటగిరికి చెందిన వారికి రూ.125 ఫీజు నుంచి మాత్రమే మినహాయింపు ఉంది. కొన్నింటికీ ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీలో దరఖాస్తు ప్రాసెస్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 వసూలుచేశారు. వీటికి అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయిస్తే...రాత పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఉండవు.