APPSC Written Exams for Jobs గతంలో జారీ చేసిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు రాత పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. గెజిటెడ్, నాన్-గెజిటెడ్ కేటగిరిలో కలిపి మొత్తం 17 నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలు ఇందులో ఉన్నాయి. తొమ్మిది నోటిఫికేషన్లకు సంబంధించిన ‘జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ’ పేపరును ఒకేరోజు (21.10.2022)న నిర్వహించబోతుంది. ఏడు నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ స్టడీస్(జీఎస్) పేపరును నవంబరు 7న, మరో నోటిఫికేషన్‌కు సంబంధించిన జీఎస్ పరీక్ష నవంబరు 9న నిర్వహించనున్నారు. పోస్టుల నేపథ్యానికి అనుగుణంగా సబ్జెక్టుల వారీగా పరీక్షలు వేర్వేరు తేదీల్లో జరగనున్నాయి. నోటిఫికేషన్లను గతంలో జారీ చేసినప్పటికీ తేదీలను ప్రకటించలేదు. వాటిని సోమవారం ఏపీపీఎస్సీ వెల్లడించింది.
గెజిటెడ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్
* అక్టోబరు 19న మత్స్యాభివృద్ధి అధికారి పోస్టుకు ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు పరీక్షలుంటాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.
* అక్టోబరు 20న పట్టు పరిశ్రమ అధికారి, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. వీటికి సంబంధించి ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు జరుగుతుంది..
* ఉద్యానాధికారి పోస్టుకు అక్టోబరు 18న క్వాలిఫైయింగ్ పరీక్ష, 20న ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు ఉంటాయి.
* అక్టోబరు 21న మధ్యాహ్నం వ్యవసాయాధికారి, పోలీసు సర్వీస్‌లోని టెక్నికల్ అసిస్టెంట్, ఏపీ సర్వే, భూ రికార్డుల సర్వీస్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి.
* డివిజినల్ అకౌంట్స్ అధికారి(వర్క్స్)- గ్రేడ్-2 పోస్టుకు నవంబరు 3న ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు నిర్వహించనున్నారు.
అక్టోబరు 21న జనరల్ స్టడీస్ పేపరు
అక్టోబర్ 21న ఉదయం మత్స్యాభివృద్ధి అధికారి, పట్టుపరిశ్రమ అధికారి, వ్యవసాయాధికారి, టెక్నికల్ అసిస్టెంట్, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్, ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్యానాధికారి, సర్వే, భూ రికార్డుల సర్వీసుల అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు ఉంటాయి.