ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. ఈ ఏడాది నవంబరు 2 నుంచి 13 వరకూ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ షెడ్యూలు నిర్ణయించినప్పటికీ.. ప్రిలిమ్స్ పరీక్షలో అనువాదం తప్పులు, తుది సమాధానపత్రంలో తప్పులు దొర్లిన అంశంపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకూ మెయిన్స్ పరీక్ష నిర్వహించొద్దని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీపీఎస్సీకీ.. దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రాలను కూడా అభ్యర్ధులు ఇవ్వడంతో ఏం చేయాలన్న దానిపై ఏపీపీఎస్సీ మల్లగుల్లాలు పడుతోంది.
ఇప్పటికే పరీక్షకు సిద్ధమైన కొందరు అభ్యర్ధులు మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని కోరుతున్నారు. అయితే గతంలో ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో దరఖాస్తులు చేసుకుని పరీక్షలు రాసిన అభ్యర్ధులు కోర్టు తీర్పుల కారణంగా అవకాశాలు కోల్పోవటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. 2011 గ్రూప్-1 నోటిఫికేషన్ విషయంలో కోర్టు తీర్పుల కారణంగా రెండుసార్లు మెయిన్స్ పరీక్షలను, ఇంటర్వూలను నిర్వహించారు. ఆ సమయంలో కొందరు అభ్యర్ధులు అవకాశాలను కోల్పోయారు. మెయిన్స్ పరీక్షకు ఇప్పుడు గడువు ఇవ్వాలని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టులో కేసు తేలిన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్ధుల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్.