ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల అమలు కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలిపింది. రెవెన్యూ లోటు సహా అన్ని విషయాలకు కలిపి ఇప్పటివరకు రూ.33, 923.01 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చెప్పారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విద్యాసంస్థల ఏర్పాటు కోసం ఆయా మంత్రిత్వ శాఖలు రూ.1656.63 కోట్లు విడుదల చేశాయన్నారు. అలాగే విభజన చట్టం అమలులో భాగంగా తెలంగాణకు రూ.1935 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇప్పటివరకు 24 సమీక్షలు నిర్వహించి... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులతో చర్చించినట్లు వెల్లడించారు. విభజన చట్టం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాబట్టి ఇతర రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం లేదని వెల్లడించారు. బుందేల్‌ఖండ్, కేబీకే ప్యాకేజీలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే.. ఏపీలో వెనకబడిన 7 జిల్లాలకు రూ. 2100 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.
ఏపీకి రూ.33వేల కోట్ల నిధులిచ్చాం: కేంద్ర హోంశాఖ
విభజన హామీల అమలు కోసం రెవెన్యూ లోటు భర్తీ సహా అన్నీ కలిపి ఇప్పటివరకు రూ.33వేల కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.
ప్రతీకాత్మక చిత్రం