ADVISORS ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు ఒకరు.. సీఎం కార్యక్రమాల్ని సమన్వయం చేసేందుకు మరొకరు.. ఆర్థిక వనరుల సమీకరణపై సలహాలకు ఇంకొకరు.. ప్రజావ్యవహారాల సలహాదారు మరొకరు.. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు ఇంకొకరు.. రాష్ట్రంలో మీడియా వ్యవహారాలు చూసేందుకు ఒకరు.. జాతీయ స్థాయిలో మీడియా సలహాదారు మరొకరు.. ఇలా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికే అరడజను మందికి పైగా సలహాదారులున్నారు. వారు చాలరన్నట్టు మైనార్టీల సంక్షేమానికి ఒకరు, ఎన్జీవోల వ్యవహారాలకు ఇంకొకరు, సామాజిక న్యాయానికి మరొకరు, సహకార శాఖకు ఇంకొకరు.. ఇలా పలు శాఖల్లో ఎడాపెడా సలహాదారుల్ని నియమిస్తున్న ప్రభుత్వం వారికి ఏటా రూ.కోట్ల ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో చెల్లిస్తోంది. ఇప్పటికే నియమించినవారు చాలరన్నట్టు సలహాదారుల నియామక పరంపర కొనసాగిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, కీలకమైన శాఖలకు 47 మందికిపైగా సలహాదారులుండగా, వారిలో 15 మందికి పైగా క్యాబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. కొందరైతే దిల్లీ నుంచే పనిచేస్తున్నారు. వారిలో ముగ్గురు, నలుగురు నిపుణులు మాత్రం జీతభత్యాలు తీసుకోకుండా గౌరవ సలహాదారులుగా ఉన్నారు. అస్మదీయుల్ని, ఆంతరంగికుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెట్టేందుకు, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, సొంత పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించేందుకు, సర్వీసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి, వైకాపా ప్రభుత్వానికి అత్యంత విధేయులుగా మెలిగిన విశ్రాంత అధికారులకు, ముఖ్యమంత్రి సొంత పత్రికలో పనిచేసినవారికి మళ్లీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వారిని సలహాదారు పోస్టుల్లో కూర్చోబెడుతోంది. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సలహాదారులు మంత్రులకు మించి అపరిమితమైన అధికారాలు అనుభవిస్తున్నారు.
మరికొందరు సలహాదారులు సరైన కార్యాలయం కూడా లేకుండానే పొద్దు పుచ్చుతున్నారు. సలహాదారుల్లో అత్యధికులు ఆ హోదాను అనుభవించడం, జీతభత్యాలు తీసుకోవడమే తప్ప.. వారు సలహా ఇచ్చేదీ లేదు. వారిని సలహా అడిగేవారూ లేరు. సలహాదారుల్లో చాలామంది ఆయా శాఖలు, విభాగాలపై అపారమైన అనుభవమో, పరిజ్ఞానమో ఉన్నవారూ కాదు. ఇంత అసాధారణ సంఖ్యలో సలహాదారుల్ని నియమించిన దాఖలాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు.
కొందరు ఎక్కడున్నారో తెలీదు..!
రాష్ట్ర ప్రభుత్వంలోని సలహాదారుల్లో కొందరు అసలు ఎక్కడున్నారో తెలీదు. ఏ సమావేశాల్లోనూ వారు కనిపించరు. వారు సలహాదారులుగా కొనసాగుతున్నారో లేదో ఆయా శాఖల్లో పనిచేసేవారికే చాలా మందికి తెలియదు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సలహాల కోసం వారిని సంప్రదించిన దాఖలాలూ లేవు. వారే కల్పించుకుని సలహాలిచ్చిన సందర్భాలూ లేవు. సలహాదారుల్లో కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనవారికే అపరిమితమైన అధికారాలు దక్కుతున్నాయి. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డిది అగ్రస్థానం. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. అజేయ కల్లంతో పాటు, ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమితులైన మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్‌కు సలహాదారు పదవితో పాటు, నవరత్నాల అమలు కమిటీ వైస్‌ఛైర్మన్ పోస్టునూ కట్టబెట్టారు.
ముఖ్యమంత్రికి కమ్యూనికేషన్స్ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్ ఉన్నారు. జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా దేవులపల్లి అమర్‌ను నియమించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ ఆయన కార్యక్రమాల్ని పర్యవేక్షించే తలశిల రఘురామ్‌కు క్యాబినెట్ హోదాలో ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ఎంపికైనా, సలహాదారు పదవిలోనూ కొనసాగిస్తున్నారు. జూపూడి ప్రభాకరరావు, షేక్ మహ్మద్ జియావుద్దీన్ వంటి పార్టీ నాయకులను... రాజకీయ పునరావాసం కల్పించేందుకు సలహాదారులుగా నియమించారు.
ప్రస్తుత సలహాదారుల్లో అజేయకల్లం, శామ్యూల్‌లతో పాటు పలువురు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం ముగియగానే ఆయనను క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించి దిల్లీ పంపించారు. ప్రభుత్వం వివిధ శాఖలకు నియమించిన సలహాదారులే కాకుండా, ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలోనూ, సీఐడీ, ఏసీబీ వంటి విభాగాల్లోనూ పలువురు న్యాయ సలహాదారులుగా పనిచేస్తున్నారు.
సలహాదారులకు రాజభోగం
పదవీకాలం మొత్తంలో ఒక్క సలహా అయినా ఇస్తున్నారో లేదో తెలియదు గానీ.. సలహాదారులకు ప్రతి నెలా రూ.లక్షల్లో జీతభత్యాల్ని ప్రభుత్వం ఠంచనుగా చెల్లిస్తోంది. సలహాదారుల హోదా, వారి నేపథ్యాలకు అనుగుణంగా జీతభత్యాలు ఉన్నాయి.
* క్యాబినెట్ హోదా ఉన్నవారికి నెల వేతనం రూ.14 వేలే. కానీ ఇంటి అద్దె భత్యం మాత్రం నెలకు రూ.లక్ష. వాహనం, ఇతర అలవెన్సులు కూడా కలిపితే వీరికి ఒక్కొక్కరికి నెలకు జీతభత్యాల రూపంలో రూ.1.80 లక్షల వరకు అందుతుంది.
* పదవీకాలంలో ఒకసారి కారు కొనుక్కోవడానికి అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇస్తారు.