ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి.దశరథరామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అంతర్‌రాష్ట్ర డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చి మరీ ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించింది. సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా డిప్యుటేషన్‌పై తనను నియమించాలంటూ జనవరి 20న దశరథరామిరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అందుకు సమ్మతి తెలపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 11న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వినతికి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా రెండేళ్ల పాటు అంతర్‌రాష్ట్ర డిప్యుటేషన్‌కు సమ్మతిస్తూ ఈ నెల 3న ఆ సమాచారాన్ని ఏపీకి తెలియజేసింది.
ఈ నేపథ్యంలో ఆయన్ను సజ్జలకు ఓఎస్డీగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు గురువారం ఉత్తర్వులిచ్చారు. ఆయన్ను వెంటనే రిలీవ్ చేసి.. చివరి వేతన చెల్లింపు ధ్రువపత్రం (ఎల్‌పీసీ)తో పాటు సర్వీసు రిజిస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖలో సమర్పించాలంటూ తెలంగాణ హోంశాఖను ఉత్తర్వుల్లో కోరారు. అయితే దశరథరామిరెడ్డి నియామకం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది.