రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ఆరోగ్యశాఖలో కొవిడ్ నిర్వహణ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకునేందుకు ఈ ప్రత్యేక పోస్టును సృష్టిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా యాభై ఎనిమిది వేల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఇప్పటి వరకూ 49 మందికి వ్యాక్సినేషన్ అనంతరం ప్రభావాలు కనిపించాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఏపీలో ఒకరు మృతి చెందినట్లు... మరొకరు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిడ్ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి అవసరమని భావిస్తూ ముద్దాడ రవిచంద్రను కొవిడ్ నిర్వహణ కార్యదర్శిగా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌కు ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.