ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త ప్రైవేట్‌ బడులు.. వస్తూనే ఉన్నాయ్‌..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రెండు జోన్లలో దాదాపు 200కు పైగా కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు అందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కరోనా వల్ల చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను గమనిస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు.. ఇదే మంచి తరుణమని భావించి రాజధాని నుంచి ఇతర జిల్లాలకు విస్తరించే పనిని ముమ్మరం చేశాయి.

NEW PVT SCHOOLS
NEW PVT SCHOOLS

By

Published : Feb 1, 2021, 3:19 PM IST

కరోనా పరిస్థితులతో రాష్ట్రంలో వందలాది చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు మూతబడే పరిస్థితి ఒక వైపు ఉన్నా.. మరో వైపు భారీగానే కొత్త బడులను నెలకొల్పేందుకు ఔత్సాహికులు ముందుకువస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రెండు జోన్లలో దాదాపు 200కు పైగా కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు అందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సాధారణంగా ఏటా సుమారుగా ఇదే సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా ఈ ఏడాది కూడా రావడం విద్యాశాఖ అధికారుల్లోనూ కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ప్రైవేట్‌ పాఠశాలల ఏర్పాటుకు ఆలస్య రుసుంతో డిసెంబరుకు గడువు ముగిసింది.

30 దరఖాస్తులు ఓ కార్పొరేట్‌ విద్యా సంస్థవే

పదో తరగతి వరకు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటివి రాష్ట్ర విద్యాశాఖకు 40 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇక 1-8వ తరగతి వరకైతే వరంగల్‌, హైదరాబాద్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్‌జేడీ) అనుమతి ఇవ్వొచ్చు. వరంగల్‌ ఆర్‌జేడీ పరిధిలోని పాత ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 50కి పైగా దరఖాస్తులు అందాయి. అందులో ఇప్పటికే పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు నడుపుతున్న ఓ కార్పొరేట్‌ విద్యా సంస్థవే 30 వరకు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇక హైదరాబాద్‌ ఆర్‌జేడీ పరిధిలోని ఆరు పాత జిల్లాలైన హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పదుల సంఖ్యలో వచ్చాయని తెలిసింది.

కార్పొరేట్ యాజమాన్యాల తీరుపై ఆగ్రహం

కరోనా వల్ల చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను గమనిస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు.. ఇదే మంచి తరుణమని భావించి రాజధాని నుంచి ఇతర జిల్లాలకు విస్తరించే పనిని ముమ్మరం చేశాయి. వరంగల్‌లాంటి నగరాల్లో చిన్న పాఠశాలలను కొనుగోలు చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మూతబడేందుకు సిద్ధంగా ఉన్న బడులను కొని పేర్లు మార్చుకుంటుండటంపై ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్య సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా పాఠశాలలను ప్రారంభించాలని కార్పొరేట్‌ యాజమాన్యాలు భావించినట్లు చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తమ బడుల్లో విద్యా బోధన ఆగదని, ప్రవేశ పరీక్షలకు కూడా తర్ఫీదు ఉంటుందని ప్రచారం చేస్తూ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇదీ చదవండి :కొత్త ప్రైవేట్‌ బడులు.. వస్తూనే ఉన్నాయ్‌..

ABOUT THE AUTHOR

...view details