Agnipath army recruitment applications 2022: అగ్నిపథ్ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు నేటి నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణలోని సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగంలో పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు.
ఇందులో భాగంగా భారత సైన్యం ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
'అగ్నిపథ్' కథ ఏంటంటే..
IAF Agnipath Scheme: త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది.
అగ్నిపథ్ పథకం విధివిధానాలు..
1923 యాక్ట్ ప్రకారం నాలుగేళ్ల వ్యవధిలో అగ్నివీరులు ఎటువంటి సైనిక రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు.
కొన్ని సందర్భాల్లో అగ్నివీరులకు సమర్థ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది.
అగ్నివీరులు తమ యూనిఫామ్‌పై ప్రత్యేకమైన బ్యాడ్జ్‌ను ధరిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన వారు 1950 నిబంధనకు లోబడి విధులు నిర్వహిస్తారు.
నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల పనితీరును బట్టి.. 25 శాతానికి మించకుండా వారిని మళ్లీ సైన్యంలోకి తీసుకుంటారు.