గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాస సమీపంలోని ఓ అపార్ట్మెంట్ వాసులు ధర్నా నిర్వహించారు. గత నెలలో మారుతి అపార్ట్మెంట్లో కరోనా వైరస్‌తో ఓ వృద్ధురాలు మృతిచెందారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా అధికారులు గుర్తించారు. ముందస్తు చర్యలలో భాగంగా అపార్ట్ మెంట్లోని అందరికీ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రావడంతో అపార్ట్ మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని 14రోజులు లేదా 28రోజులు కంటోన్మెంట్ జోన్ ప్రకటించారు. పోలీసులు సైతం అపార్ట్ మెంట్ వాసులపై కఠిన ఆంక్షలు విధించారు. 14రోజుల పాటు ఎవర్నీ బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 14 రోజులు ముగిసిన తర్వాత దీనిని 28 రోజులకు పొడిగించారు. తాజాగా 28రోజులు ముగిసినా పోలీసులు ఎవర్నీ బయటకు రానీయకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులను అడ్డుకున్నారు.