ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ap Genco: ఆర్థిక గండం గట్టెక్కడానికి.. అన్ని వేల కోట్లు కావాలా?!

ఆర్థిక కష్టాలనుంచి బయటపడటానికి రూ.2 వేల కోట్లు సర్దుబాటు చేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జెన్‌కో లేఖ(ApGenco letter to government) రాసింది. డిస్కంల నుంచి రావాల్సిన సుమారు రూ.3,200 కోట్ల బకాయిల నుంచి సర్దుబాటు చేయాలని కోరింది. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల నుంచి తీసుకున్న రుణాలపై జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు చెల్లించాల్సిన వాయిదాలు బకాయి పడ్డాయని పేర్కొంది.

Ap Genco letter to government
ఆర్థిక గండం గట్టెక్కడానికి రూ.2 వేల కోట్లు కావాలి

By

Published : Nov 11, 2021, 7:26 AM IST

నిరర్థక ఆస్తుల జాబితా(ఎన్‌పీఏ) నుంచి బయటపడటానికి రూ.2 వేల కోట్లు సర్దుబాటు చేయాలని కోరుతూ ఏపీ జెన్‌కో ప్రభుత్వానికి లేఖ(ApGenco letter to government) రాసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), విద్యుత్‌ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ)ల నుంచి తీసుకున్న రుణాలపై జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు చెల్లించాల్సిన వాయిదాలు బకాయి పడ్డాయని పేర్కొంది. డిస్కంల నుంచి రావాల్సిన సుమారు రూ.3,200 కోట్ల బకాయిల నుంచి సర్దుబాటు చేయాలని కోరింది. విజయవాడలోని వీటీపీఎస్‌లో 800 మెగావాట్లు, కడప ఆర్‌టీపీపీలో 600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్‌ఈసీ నుంచి సుమారు రూ.8,600 కోట్లను జెన్‌కో అప్పుగా తీసుకుంది. దీంతోపాటు గతంలో ఏర్పాటు చేసిన ప్లాంట్లపై చెల్లించాల్సిన బకాయిలు కలిపితే సుమారు రూ.10 వేల కోట్లు ఉంటాయి. కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్‌ అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్‌) భాగస్వామ్యంతో సుమారు రూ.10 వేల కోట్లను కేంద్ర విద్యుత్‌ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ) నుంచి రుణంగా తీసుకుంది. ఈ రూ.20 వేల కోట్ల రుణాలకు సంబంధించి ప్రతి నెలా రూ.700 కోట్లను పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలకు చెల్లించాలి.

జెన్‌కో అప్పులకు కారణాలివీ..
జెన్‌కో పరిధిలో విజయవాడలో వీటీపీఎస్‌, కడపలో ఆర్‌టీపీపీ, కృష్ణపట్నంలలో మొత్తం 5,010 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించటం ద్వారా ప్రతి నెలా సుమారు రూ.వెయ్యి కోట్లు జెన్‌కోకు రావాలి. డిస్కంలు ప్రతి నెలా పూర్తిగా చెల్లించకపోవడంతో సుమారు రూ.3,200 కోట్లు బకాయిపడ్డాయి. దీంతో అప్పులపై నెలవారీ వాయిదాలు చెల్లించటం జెన్‌కోకు కష్టంగా మారింది. మరోవైపు తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,111.88 కోట్లు జెన్‌కోకు రావాల్సి ఉంది.

  • బహిరంగ మార్కెట్‌లో చౌకగా దొరికే విద్యుత్‌ కొనుగోలుకే డిస్కంలు రెండేళ్లుగా ప్రాధాన్యమిస్తున్నాయి. దీనివల్ల జెన్‌కో ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించింది. నిధులు సర్దుబాటు కాక బొగ్గును పూర్తి స్థాయిలో సమకూర్చుకోలేదు. ఈ పరిణామాలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ప్రకారం (పీపీఏ) రావాల్సిన స్థిర ఛార్జీల్లో కోత పడింది. ఇది సుమారు రూ.1,200-1500 కోట్ల వరకు ఉంటుంది.
  • జెన్‌కోకు వివిధ సంస్థల నుంచి వసూలు కావాల్సిన బకాయిలన్నీ కలిపి సుమారు రూ.10 వేల కోట్లున్నాయి. అవి సర్దుబాటైతే సగం అప్పు తీరుతుంది. మిగిలిన రూ.10 వేల కోట్లు ప్లాంట్ల నిర్మాణానికి తీసుకున్న మూలధన వ్యయం కావటం వల్ల దీర్ఘకాలంలో తీర్చటం సులువుగా ఉంటుందని ఒక అధికారి తెలిపారు.

వచ్చే శుక్రవారం తెలంగాణ అధికారులతో మరోసారి సమావేశం
తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లో పేర్కొన్న నిబంధన ప్రకారం 15 శాతం వడ్డీతో కలిపి రూ.6,111.88 కోట్లుగా ఏపీజెన్‌కో పేర్కొంది. ఈ మొత్తం వసూలు కోసం కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి దగ్గర సోమవారం జరిగిన సమావేశంలో పరిష్కారం వస్తే ఆర్థిక సమస్య తీరుతుందని భావించారు. కానీ ట్రాన్స్‌కో, డిస్కంలతో ఉన్న బకాయిల సమస్యతో తెలంగాణ ముడిపెట్టింది. వడ్డీ 11.5 శాతం వంతున లెక్కగట్టి బకాయిల మొత్తాన్ని తెలంగాణ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. దీంతో మరో వారం రోజుల్లో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై బకాయిల విషయంలో స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించింది. దీనిపై వచ్చే శుక్రవారం సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.

ఇదీ చదవండి..

PPA MEETING: పోలవరంపై ఢీ....ఫైలు పంపకుంటే పెట్టుబడి వచ్చేదెలా?

ABOUT THE AUTHOR

...view details