ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల కింద కొత్త ఆయకట్టు లేదు: జగన్ - jagan and kcr in Apex Council Meeting news

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని జలవివాదాలే ప్రధాన అజెండాగా జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో దిల్లీలో అత్యున్నత మండలి భేటీ జరిగింది. దృశ్యమాధ్యమం ద్వారా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.

Apex Council Meeting Over In Delhi
దిల్లీలో ముగిసిన అత్యున్నత మండలి సమావేశం

By

Published : Oct 6, 2020, 3:30 PM IST

Updated : Oct 6, 2020, 7:37 PM IST

తెలుగు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల నేపథ్యంలో నదీజలాల వివాదాలపై అత్యున్నత మండలి సమావేశమైంది. దిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో భేటీ అయిన ఈ సమావేశానికి... హైదరాబాద్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్... దిల్లీ నుంచి ఏపీ సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. దృశ్యమాధ్యమం ద్వారా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు హాజరయ్యారు.

ప్రధానంగా నాలుగు అంశాలు..

నాలుగు అంశాలను అపెక్స్ కౌన్సిల్ అజెండాగా నిర్ణయించగా... ఏడు అంశాలను చేర్చాలని కేసీఆర్‌ కోరారు. పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలపైనా చర్చించారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొనగా.. నోటిఫై చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. నాగార్జునసాగర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేయగా... రెండు ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఏపీ కోరింది.

కృష్ణా బోర్డు ఏపీకి!

పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతలపై కేసీఆర్ అభ్యంతరాన్ని తెలిపారు. దీనిపై స్పందించిన జగన్.. వీటికి ఆయకట్టే లేదని... కేటాయింపులను సరిగా వాడుకునేందుకే పనులు చేపట్టామని వెల్లడించారు. గోదావరి జలాల పంపిణీకి, ట్రైబ్యునల్​ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు తమ అంగీకారాన్ని తెలిపాయి. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలన్న అంశంలో... తెలంగాణ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.

ఏడాదికోసారైనా..

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదేనని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలూ సిద్ధంగా ఉన్నారని షెకావత్ పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టుల సాంకేతిక అంచనాలను త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని షెకావత్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు

Last Updated : Oct 6, 2020, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details