Penalty for electricity officers విద్యుత్తు శాఖ వినియోగదారులకు పౌరపట్టిక ప్రకారం సేవలు అందించకుండా జాప్యం చేసిన అధికారులకు ఏపీఈఆర్‌సీ షాక్ ఇచ్చింది. గడువులోపు సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు అపరాధ రుసుం విధించింది. ఆ మొత్తాలను వేతనాల్లో కోత విధించాలని ఆదేశించింది. ఆ సొమ్మును ఫిర్యాదు చేసిన వినియోగదారుల విద్యుత్తు సర్వీసులకు జమ చేయాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు విద్యుత్తు శాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(ఏఈఈ)పై 915 సర్వీసులకు సంబంధించి రూ.7.75లక్షల అపరాధ రుసుం విధించారు.
ఇదీ లెక్క : ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి సర్కిల్ పరిధిలో చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, మదనపల్లె, పీలేరు, పుత్తూరు, తిరుపతి రూరల్, తిరుపతి నగరం డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31వరకు మూడు నెలల్లో విద్యుత్తు అధికారులు వినియోగదారులకు అందించిన సేవలను ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులు పరిశీలించారు. పౌరపట్టిక ప్రకారం నూతనంగా దరఖాస్తు చేసుకున్న 302 విద్యుత్తు సర్వీసుల ప్రక్రియ సకాలంలో పూర్తి చేయని కారణంగా రూ.3.36లక్షలు, సరఫరా ఆగిందని టోల్‌ఫ్రీ కార్యాలయం నంబర్లకు ఫిర్యాదు చేస్తే (ఫీజ్ ఆఫ్ కాల్)సమస్యను గడువులోపు పరిష్కరించలేదని 449 సర్వీసులకు రూ.44,900, కొత్తగా 164 సర్వీసులకు నిబంధనల ప్రకారం నగదు చెల్లించినా సకాలంలో విడుదల చేయలేదని రూ.3.93లక్షలు మొత్తాన్ని సంబంధిత అధికారులపై అపరాధ రుసుం విధించారు.