chenetha uniform: చేనేత కార్మికులకు చేయూత అందించాల్సిన ఆప్కో ఆధికారులు.. మరమగ్గాలకు సహకరిస్తున్నారు. నేత కార్మికుల నుంచే వస్త్రాన్ని సేకరించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా పక్కన పెట్టేశారు. పాఠశాల విద్యార్థుల యూనిఫాం కోసం మరమగ్గాలపై తయారు చేసిన వస్త్రాన్ని ఏకంగా 20 లక్షల మీటర్లు సేకరించారు. అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకే ఇలా వ్యవహరించినట్లు ఆప్కోలో చర్చసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆప్కో ద్వారా నేత వస్త్రానికి బదులుగా మరమగ్గాలపై నేసిన వస్త్రాన్ని సేకరించారనే ఆరోపణలపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతోంది. అయినా తాజాగా మరమగ్గాలపై తయారు చేసిన లివరీ వస్త్రాన్ని ఆప్కో సేకరించడం గమనార్హం.
రెండు విడతల్లో సేకరణ...
చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేత... తన అనుచరులకు చెందిన పవర్‌లూమ్ (కో ఆపరేటివ్ సొసైటీ) పరిశ్రమ నుంచి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు యూనిఫాంల కోసం వస్త్రాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నారు. సొసైటీ పేరుతో 20 లక్షల మీటర్ల వస్త్రాన్ని ఆప్కో ద్వారా అందించేలా అనుమతి పొందారు. ఇందులో గతేడాది అక్టోబరు నాటికే 14.5 లక్షల మీటర్లు సరఫరా చేశారు. అయితే అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అంతటితో ఆపారు. ఆ తర్వాత ఆప్కో నిబంధనల్ని సవరించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిపై చేనేత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. సదరు సొసైటీ యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరగడంతో డిసెంబరులో మిగతా 5.5 లక్షల మీటర్ల వస్త్రాన్ని సేకరించారు.