Sailajanath: మద్యం అమ్మకాలు తగ్గేలా చూడాల్సిన బాధ్యత ఉన్న పార్టీ నాయకులు.. చీప్ ట్రిక్స్‌కు పాల్పడడం తగదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర భాజపా దిగజారిందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నోరు విప్పలేని భాజపా నేతలు.. మద్యం తక్కువ ధరకు ఇస్తామని ప్రకటన చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోము వీర్రాజు ప్రకటన మద్యం అమ్మకాల ద్వారా పేదల జీవితాలు చిన్నాభిన్నం చేయడమేనని శైలజానాథ్ పేర్కొన్నారు. భాజపా సభ పూర్తిగా విఫలమైందని, చీప్ లిక్కర్ ఇస్తాం.. ఓటేయండనే దుస్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. సోమువీర్రాజు పిచ్చి పరాకాష్టకు చేరిందని, అమరావతిపై భాజపా నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే భాజపా జాతీయ విధానమా..? లేక నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా..? అని ప్రశ్నించారు.