దేశంలో విధించిన నాలుగు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన ప్రయోజనమేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. మోదీ ప్రభుత్వం వల్ల కోట్లాది మంది వలస కూలీలు నష్టపోయారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాభవన్లో నిర్వహించిన స్పీకప్ ఇండియా కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సాయం పెద్దలకు తప్ప పేదలకు అందలేదని శైలజానాథ్ ఆరోపించారు. వలస కార్మికులను ఉచితంగా వారి స్వస్థలాలకు పంపాలని, ఆదాయపన్ను పరిమితిలోకి రానివారికి తక్షణమే రూ.10 వేలు ఆర్థికసాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులు వారి సొంత ఊళ్లకు చేరాక, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 పనిదినాలు కల్పించాలన్నారు. పేదలు, చిన్న తరహా పరిశ్రమలకు నగదు బదిలీ చేయాలని కోరారు.