ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అగ్నిపథ్‌పై యువతలో అసంతృప్తి.. రాష్ట్రంలో ఆర్మీ ఉద్యోగార్థులు లక్షన్నర పైనే..! - agnipath protest

సైన్యంలో చేరాలనేది ఎంతోమంది యువత కల. సాధారణంగా ఆరు నెలలకోసారి నియామక ర్యాలీలు జరుగుతుంటాయి. రాష్ట్రంలో ఏటా 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది వరకు యువత ఆర్మీ కొలువుల కోసం ప్రయత్నిస్తుంటుంది. ఎక్కడైనా నియామక ర్యాలీ జరిగితే కనీసం 50 వేలమంది వరకూ పాల్గొంటుంటారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా దేశవ్యాప్తంగా ఒకటి, రెండు మినహా పెద్దగా నియామక ర్యాలీలు జరగలేదు. దీంతో చాలామంది వయోపరిమితి కారణంగా అవకాశం కోల్పోయారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సన్నద్ధమవుతున్న ఇంకొందరు త్వరలో నోటిఫికేషన్‌ రాకపోతుందా? అని ఆశతో చూస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ పథకం తెరపైకి తేవటంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఎంపికైన వారిలో 75 శాతంమందిని నాలుగేళ్లు మాత్రమే పనిచేయించుకుని బయటకు పంపించేస్తామంటే ఇన్నాళ్లుగా తాము ఆ ఉద్యోగం కోసం పడిన శ్రమంతా ఏం కావాలని కొందరు వాపోతున్నారు. మరికొందరు మాత్రం కనీసం ఈ రూపంలోనైనా ఓ అవకాశం లభిస్తే చాలని ఆశపడుతున్నారు.

ap youth unsatisfaction on agnipath
ap youth unsatisfaction on agnipath

By

Published : Jun 18, 2022, 4:01 AM IST

రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరులలో ఆర్మీ రిక్రూటింగ్‌ ఆఫీసులు (ఏఆర్‌వో) ఉన్నాయి. వీటి పరిధిలో సాధారణంగా ఆరు నెలలకోసారి నియామక ర్యాలీలు జరిగేవి. ఒకసారి అవకాశం చేజారినా మరోసారైనా విజయం సాధించొచ్చనే ఉద్దేశంతో వేలమంది సన్నద్ధమవుతుంటారు. గత ఏడాది జులై 16 నుంచి 30 వరకు గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్‌క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌, ట్రేడ్‌మెన్‌ ఉద్యోగాలకు ప్రకటన వెలువరించారు. సుమారుగా 35 వేలమంది హాజరయ్యారు. శరీర దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు కూడా జరిగాయి. సుమారు 2,500 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారని సమాచారం. వీరికి అక్టోబరు 31న రాత పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. పలుమార్లు వాయిదా పడింది. అగ్నిపథ్‌ ప్రకటన నేపథ్యంలో తమ ఉద్యోగ భవిత ఏమవుతుందోనని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఆగస్టు 16 నుంచి 31 మధ్య విశాఖపట్నంలో ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తామని అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 50వేల మందికి పైగా నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. తర్వాత ర్యాలీని వాయిదా వేశారు. దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది వయోపరిమితి దాటిపోవడంతో ఇప్పుడు అవకాశం కోల్పోయారు.

ఇన్నేళ్ల శ్రమ వృథాయేనా..: ఇండియన్‌ ఆర్మీలో జనరల్‌ సోల్జర్‌ ఉద్యోగాల కోసం పదిహేడున్నరేళ్ల వయసు నుంచి 21 ఏళ్ల వరకూ అవకాశం ఉంటుంది. వీటికే ఎక్కువ మంది సన్నద్ధమవుతుంటారు. టెక్నికల్‌ విభాగంలో సోల్జర్‌గా చేరేందుకు మాత్రం 23 ఏళ్ల వరకూ అవకాశం ఉంది. రెండేళ్లుగా నియామకాలు లేకపోవటంతో కొంతమంది గరిష్ఠ వయోపరిమితిని దాటేశారు. తాము ఇన్నేళ్లుగా పడిన శ్రమంతా వృథా అయిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"రెండేళ్లుగా ఆర్మీ నియామక ర్యాలీలే నిర్వహించలేదు. నాకు పదిహేడున్నరేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి సైనిక కొలువు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా. గతంలో జరిగిన ర్యాలీల్లో పాల్గొన్నా ఎంపిక కాలేదు. ఆ అనుభవం ద్వారా తర్వాతి ర్యాలీల్లో పాల్గొని ఎలాగైనా ఉద్యోగం సాధించొచ్చని అనుకున్నాను. ఇప్పుడు నాకు 23 ఏళ్లు నిండిపోయాయి. అంటే వయోపరిమితి దాటిపోయినట్లే. రెండేళ్లుగా ర్యాలీలు నిర్వహించనందున అవకాశం కోల్పోయాను" అని శ్రీకాకుళం జిల్లాకు సాయి అనే నిరుద్యోగి వాపోయాడు.

"ఆర్మీలో చేరాలనేది నా లక్ష్యం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సన్నద్ధమవుతున్నా. అగ్నిపథ్‌ పేరిట నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని బయటకు పంపించేస్తామంటున్నారు. ఇప్పుడు నా వయసు 23 ఏళ్లు. నాలుగేళ్ల తర్వాత పంపించేస్తే అప్పటికి నాకు 27 ఏళ్ల వయసు వస్తుంది. అటు ఆర్మీలోనూ కొనసాగలేక.. ఇక్కడ మరో ఉద్యోగానికీ అవకాశం దొరకక రెండింటికీ చెడ్డ రేవడిగా మిగులుతానేమో.." - శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఆవేదన

"ఆర్మీ ఉద్యోగాల కోసం సన్నద్ధమవ్వాలంటే తక్కువలో తక్కువగా నెలకు రూ.6-7 వేల వరకూ ఖర్చవుతుంది. రెండేళ్లుగా ర్యాలీలు జరుగుతాయని ఎదురుచూస్తూనే సన్నద్ధమవుతున్నాం. ఫలితం లేదు. ఇప్పుడు అగ్నిపథ్‌ అంటున్నారు. నాలుగేళ్ల వరకే సర్వీసులో ఉంచుకుంటామంటే ఎలా?" - విజయనగరం జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగి వేదన

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details