వచ్చే మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సిన్ కోటి డోసులు పంపిణీ అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వ్యాక్సిన్ల నిల్వ, పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. పీటీఐ కథనం ప్రకారం...శాసనసభ సమావేశాల్లో కరోనా నివారణ చర్యలపై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన విధానాలపై చర్చించారు.
మూడు, నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్రం స్పష్టం చేసినట్లు సీఎం తెలిపారు. తొలిదశ పంపిణీలో ఏపీలో కోటి మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సంకేతాల మేరకు నిల్వ, పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తొలిదశ పంపిణీలో 3.6 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, 7 లక్షల ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, 50 ఏళ్లకు పైబడిన సుమారు 90 లక్షల మందికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వ్యాక్సిన్ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతతో 4065 శీతల గిడ్డంగులు, 29 రిఫ్రిజిరేటర్ వాహనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌కు అవసరమైన కోల్డ్ బాక్సులు, సిరెంజ్‌లను కేంద్ర ప్రభుత్వం అందించాలని కోరారు.