ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెదర్​ అప్​డేట్​: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి.. తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, విశాఖ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

weather news
weather news

By

Published : Oct 11, 2020, 8:26 AM IST

Updated : Oct 11, 2020, 1:24 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి.. తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాత్రికి ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. విశాఖకు ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల, కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. నర్సాపురం-విశాఖ మధ్య రేపు రాత్రికి తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో విశాఖ జిల్లాకు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీచేసింది. విశాఖ జిల్లా అధికారులను కలెక్టర్ వినయ్‌చంద్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లు 0891–2590102, 0891-2590100 ఏర్పాటు చేశారు. లోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో రాత్రి నుంచి పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా కంభంలో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు జిల్లా పాకాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాకాల లంకలో కొట్టుకుపోతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అనంతపురం జిల్లా కదిరి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో పలుచోట్ల రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో కురుస్తున్న వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

గుంటూరు జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద మూడో నంబర్ ప్రమాద సూచిక జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో ప్రమాద సూచికను పోర్ట్ అధికారులు ఎగురవేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు వెనక్కి రావాలని హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు.

ఇదీ చదవండి:ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కేంద్రం నివేదిక

Last Updated : Oct 11, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details