కృష్ణా నదీ జలాల్ని అక్రమంగా వినియోగించుకునేందుకు... అనుమతుల్లేకుండా, విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న, కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఈ నెల 6న లేఖ రాశారు. తెలంగాణ చేపడుతున్న కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు ప్రతిపాదనల డీపీఆర్‌లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిళ్లకు అందజేయాల్సిందిగా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులకు మించి... అదనంగా 183 టీఎంసీల జలాల్ని వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 8 ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. వాటితో కలిపి 15 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, మరో తొమ్మిది చిన్నతరహా ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతోందని తెలిపారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో ప్రస్తావించని, ట్రైబ్యునల్ కేటాయింపులు జరపని ప్రాజెక్టులపై ముందుకు వెళ్లకుండా తెలంగాణను నిరోధించాలని కోరారు.
శ్యామలరావు లేఖలో ప్రస్తావించిన ముఖ్యాంశాలు
బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా 2015 జూన్ 18, 19 తేదీల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ అదనంగా 183 టీఎంసీల జలాల్ని వాడుకునేందుకు తెలంగాణ మొదట 8 కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. వీటిని అడ్డుకోవాలని 2020 మే 14న కేఆర్‌ఎంబీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. 2020 జూన్‌లో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ ఫిర్యాదు చేశాం. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేఆర్‌ఎంబీకి, సీడబ్ల్యూసీకి, అపెక్స్ కౌన్సిల్‌కి సమర్పించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆదేశించారు.