శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధన ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌లు, ఎంఆర్‌ఐ సదుపాయాల కల్పించేందుకు 67 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని , విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని 11 భోధన ఆసుపత్రుల్లో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు ఉన్నాయని సీఎం అన్నారు. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయని, వాటిలో టెక్నాలజీ, నాణ్యత ప్రమాణాలు కూడా లేవన్నారు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆసుపత్రుల్లో నాలుగు చోట్ల సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ పరికరాలు లేవు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. మిగిలిన ఏడు చోట్ల ఆ సదుపాయాలు పీపీపీ విధానంలో ఉన్నాయి కాబట్టివాటిని ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేస్తుందని, ఇంకా కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్ ఆస్పత్రులలో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు.
ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో...
కొత్తగా ఏర్పాటు చేసే 16 టీచింగ్ ఆస్పత్రులతో పాటు ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తున్నామమన్నారు. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నామన్నారు. టీచింగ్ ఆస్పత్రులలో ఆ సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ‘నాడు–నేడులో ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రులలో అన్ని సదుపాయాల ఏర్పాటు చేస్తామన్నారు.