రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు 2021-22 సంవత్సరానికి చెందిన వార్షిక కౌలును మూడు వారాల్లో జమచేస్తామని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఆ వివరాల్ని నమోదు చేసిన హైకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు చెల్లించే వార్షిక కౌలు జాప్యంపై మందడం గ్రామానికి చెందిన రైతు ఆలూరి యుగంధర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. జీవో 75 ప్రకారం వార్షిక కౌలును ఏటా మే 1 వ తేదీకి చెల్లించాల్సి ఉందని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. సకాలంలో కౌలు సొమ్ము అందక రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు . కోవిడ్ సమయంలో జీవనాధారం మరింత కష్టంగా మారిందన్నారు . ఈ వ్యాజ్యం దాఖలు చేశాక కౌలు చెల్లింపు నిమిత్తం 195 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేయాల్సిన బాధ్యత ఏఎంఆర్డీఏ కమిషనర్ పై ఉందన్నారు. ఇప్పటికే జీవో జారీచేశామని ఏఎంఆర్ డీఏ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కౌలు సొమ్ము జమచేయడానికి నాలుగు వారాల సమయం పడుతుందన్నారు. అంత సమయం ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి పేర్కొనడంతో.. మూడు వారాల్లో జమచేస్తామని హామీ ఇచ్చారు. వివరాల్ని నమోదు చేసిన న్యాయమూర్తి ఆమేరకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.
'రాజధాని రైతుల వార్షిక కౌలును 3 వారాల్లో జమచేస్తాం' - AP Capital News
రాజధాని రైతుల వార్షిక కౌలును మూడు వారాల్లో జమచేస్తామని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఆ వివరాల్ని నమోదు చేసిన హైకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
'రాజధాని రైతుల వార్షిక కౌలును 3 వారాల్లో జమచేస్తాం'